కేసీఆర్ కు బలమైన దెబ్బ.. కాంగ్రెస్ లోకి చేరిన నల్లాల ఓదెలు దంపతులు

Update: 2022-05-19 15:30 GMT
షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మరో ఏడాదిన్నరకు పైనే ఎన్నికలకు సమయం ఉంది. కానీ.. తెలంగాణలో రాజకీయం మాత్రం హాట్ హాట్ గా మారింది. కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతుందన్న మాట వినిపిస్తున్న వేళలోనే.. ఇంతకాలం బలహీనంగా ఉన్నట్లుగా చెప్పే విపక్షాలు ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. గతంలో మాదిరే ఈసారి కూడా ముందస్తు దిశగా కేసీఆర్ అడుగులు వేయొచ్చన్న మాట వినిపిస్తోంది.

అదే జరిగితే వచ్చే ఏడాది మొదట్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం ఉంది. దీంతో.. రాజకీయ సమీకరణాలు తెలంగాణలో వేగంగా మారుతున్నాయి. అందులో భాగంగా తాజాగా తెలంగాణ అధికారపక్షానికి ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడిగా.. చెన్నూరు మాజీ ఎమ్మెల్యేగా సుపరిచితులు నల్లాల ఓదెలు.. ఆయన సతీమణి గులాబీ కారు దిగేసి.. కాంగ్రెస్ కండువా కప్పుకోవటం ఆసక్తికర పరిణామంగా మారింది.

తెలంగాణ కాంగ్రెస్ రథసారధి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లాల ఓదెలు దంపతులు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. అనంతరం వారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్వయంగా వారి మెడలో కండువాలు కప్పుతూ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దీంతో.. సుదీర్ఘకాలంగా టీఆర్ఎస్ తో ఉన్న అనుబంధం తెగినట్లైంది.

మాజీ ఎమ్మెల్యేగా నల్లాల ఓదెలు వ్యవహరిస్తుంటే.. ఆయన సతీమణి  భాగ్యలక్ష్మీ మంచిర్యాల జెడ్పీ ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. 2009, 2014లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ఓదెలు విజయం సాధించారు. అంతేకాదు.. ఉద్యమంలో భాగంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఓదెలు.. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి.. తన సత్తా చాటారు. 2014లో ఎమ్మెల్యేగా విజయం సాదించిన తర్వాత ప్రభుత్వ విప్ గా వ్యవహరించారు. ఇక.. ఆయన సతీమణి భాగ్యలక్ష్మీ విషయానికి వస్తే.. జెడ్సీ ఛైర్ పర్సన్ గా మరో రెండేళ్లకు పైనే పదవీ కాలం ఉందన్న సంగతి తెలిసిందే.

ఇంతకూ టీఆర్ఎస్ పార్టీకి ఈ దంపతులు గుడ్ బై చెప్పారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. రాజకీయ వర్గాల మధ్య నడుస్తున్న చర్చ ప్రకారం చూసినా.. స్థానిక పరిస్థితుల్ని పరిశీలించినా.. ప్రస్తుత ఎమ్మెల్యే కమ్ ప్రభుత్వ విప్ గా వ్యవహరిస్తున్న బాల్క సుమన్ తో పెరిగిన దూరమే కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు కారణమైందంటున్నారు. సుమన్ తో పెరిగిన విభేదాల కారణంగా ఓదెల దంపతులు పార్టీ వీడినట్లుగా చెబుతున్నారు.

దీనికి తోడు.. దూరాన్ని తగ్గించాల్సిన కేసీఆర్.. కేటీఆర్ లు పట్టించుకోకపోవటంతో వేదన చెందిన ఆయన.. గులాబీ బాస్ కు షాకివ్వాలని డిసైడ్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తన సహచరులతో పాటు.. తన వెంట నడిచే కార్యకర్తల అభిప్రాయాన్ని పెద్ద ఎత్తున సేకరించిన వారు.. చివరకు టీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టాలని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. చూస్తుంటే.. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలపై రేవంత్ ఫోకస్ పెట్టినట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News