బీజేపీ 'అఖండ' విజయంపై నలుగురు అధినేతలు స్పందిచలేదే

Update: 2022-03-12 09:30 GMT
యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావటం.. అంచనాలకు మించిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. బీజేపీ వర్గాలతో పాటు.. పలువురు మోడీషాలకు అభినందనలు తెలిపారు. ప్రతికా ప్రకటనలు.. మీడియాతో మాట్లాడే వేళలో అభినందనలు తెలపటంతో పాటు.. సోషల్ మీడియాలోనూ పోస్టులు పెట్టటం తెలిసిందే. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. బీజేపీ సాధించిన అఖండ విజయంపై తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికార.. ప్రతిపక్షాలకు చెందిన అధినేతలు ఎవరూ స్పందించకుండా మౌనంగా ఉండం ఆసక్తికరంగా మారింది.

బీజేపీతో సున్నం పెట్టుకొని.. ఎన్నికల ఫలితాల కంటే ముందే.. యూపీలో బీజేపీ ఓటమి ఖాయమన్న నమ్మకంతో దూకుడు ప్రదర్శించిన టీఆర్ఎస్ అధినేత కమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనంగా ఉండటం తెలిసిందే. ఆయన స్పందించకపోవటాన్ని అర్థం చేసుకోవచ్చు. మోడీషాలకు వ్యతిరేకంగా గళం విప్పిన ఆయనకు  బీజేపీ సాధించిన అఖండ గెలుపును ప్రస్తావించటం.. కమలనాథులకు అభినందనలు తెలపటం కష్టమే. దీనికి తోడు ఆయనకు స్వల్ప అస్వస్థతకు గురికావటం.. వారం పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆయన నుంచి స్పందన రాకపోవటం పెద్ద విషయమే కాదు.

కానీ.. ఏపీకి చెందిన మూడు పార్టీలకు చెందిన అధినేతలు మౌనంగా ఉండటం మరింత ఆసక్తికరంగా మారింది. ఏపీ అధికారపక్ష అధినేత కమ్ సీఎం జగన్మోహన్ రెడ్డి బీజేపీ సాధించిన విజయాలపై పెదవి విప్పలేదు. మాట వరసకు అభినందనలు తెలియజేయలేదు. నేరుగా అభినందనలు తెలపటం కష్టమనుకుంటే.. సోషల్ మీడియాలో పోస్టు ద్వారా అయినా చెప్పొచ్చు.

కానీ.. అలాంటిదేమీ చేయకుండా మౌనంగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించేలా మారింది. ఈ మధ్యనే కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్ ను ప్రధాని మోడీ కొడుకు మాదిరి చూస్తారని.. ఒక తండ్రి మాదిరి ట్రీట్ చేస్తారని.. ఆయన ఎప్పుడు అడిగినా కాదనకుండా టైమిస్తారని చెప్పటం తెలిసిందే.

మరి.. ఇంత అనుబంధం ఉన్న జగన్.. తనకు తండ్రిలా వ్యవహరించే మోడీ సాధించిన అద్భుత విజయానికి ఎందుకు స్పందించలేదు? కనీస అభినందనల్ని కూడా ఎందుకు చెప్పలేదు? అన్నది ప్రశ్నగా మారింది. ఇక.. టీడీపీ అధినేత కమ్ ఏపీ విపక్ష నేత చంద్రబాబు సైతం నాలుగు రాష్ట్రాల గెలుపుపై స్పందించకుండా ఉండిపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీతో మళ్లీ జట్టు కట్టటం కష్టమే అయినప్పటికీ.. బీజేపీ సాధించిన ఘన విజయంపై స్పందించకుండా ఉండటమే కాదు.. కనీసం సోషల్ మీడియాద్వారా అయినా పోస్టు పెట్టటకపోవటం రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఇక.. ఏపీలో బీజేపీకి మిత్రుడిగా వ్యవహరిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయాన్ని చూస్తే.. ఆయన సైతం ఆశ్చర్యకరంగా వ్యవహరించారు. కేసీఆర్.. చంద్రబాబు.. జగన్ ముగ్గురు మౌనంగా ఉన్నారనుకుంటే ఆయా కారణాలు ఉన్నాయని సరిపెట్టుకోవచ్చు. కానీ.. తన పార్టీ మిత్రుడిగా వ్యవహరిస్తున్న బీజేపీ.. నాలుగు రాష్ట్రాల్లో ఘన విజయాన్ని సాధించినప్పటికీ మౌనంగా ఉండటం.. నోరు విప్పకపోవటం.. కనీస అభినందనలు కూడా తెలియజేయకపోవటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన పార్టీ అధినేతలు బీజేపీ సాధించిన విజయానికి స్పందిస్తుంటే.. తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలకమైన నాలుగు పార్టీ అధ్యక్షులు మాత్రం అందుకు భిన్నంగా ఉండటం విశేషం.
Tags:    

Similar News