హైదరాబాద్ లో పెళ్లికి వెళ్లి.. మృతి చెందిన నలుగురు

Update: 2019-11-11 04:29 GMT
ఊహించని పరిణామాలు చోటు చేసుకోవటం హైదరాబాద్ లో ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. తాజాగా చోటు చేసుకున్న విషాదం చూస్తే.. ఈ మాటలో నిజం ఎంతన్నది అర్థం కాక మానదు. హైదరాబాద్ లోని గోల్నాకలో పెరల్ ఫంక్షన్ హాల్ లో వివాహ వేడుక జరుగుతోంది. అక్కడ వాతావరణమంతా సందడిగా ఉన్న వేళ.. ఊహించని రీతిలో ఫంక్షన్ హాల్ ముందు భాగంలో ఇటీవల నిర్మించిన గోడ ఒక్కసారి కూలిపోయింది.

పెద్ద ఎత్తున కట్టిన గోడ నాణ్యత లేకుండా ఉండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెబుతున్నారు. గోడ నిర్మాణంలో ఫంక్షన్ హాల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే ఈ ఘోరం జరిగిందంటున్నారు. ఊహించని విధంగా కూలిన గోడ కారనంగా ఒక మహిళతో సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరికొందరిని హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనలో ఒక కారు.. పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. గోడ కూలిన ఘటనపై మేయర్ బొంతు రామ్మోహన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఆర్నెల్ల తర్వాత ఈ రోజే ఫంక్షన్ హాల్ ను తిరిగి ఓపెన్ చేశారని.. ఫిల్లర్ సాయం లేకుండా భారీ గోడను నిర్మించటంతో ఈ దారుణం జరిగినట్లు చెబుతున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

గోడ కూలిన ఘటనపై విచారణకు ఆదేశిస్తూ జీహెచ్ ఎంసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గోడ కూలిన సమయంలో భోజనాలు జరగటం కారణంగా పెను ముప్పు తప్పిందని.. అదే.. ఊరేగింపు వేళలో కానీ కూలి ఉంటే ఊహించనంత దారుణంగా చోటు చేసుకునేదని చెబుతున్నారు.
Tags:    

Similar News