లాక్ డౌన్: పెద్దాయన్ని కొట్టి చంపిన యువకులు!

Update: 2020-04-01 10:10 GMT
కరోనా వైరస్ తో ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది. ఈ క్రమంలో కొంతమంది కరోనా వైరస్ వచ్చిందని అనుమానంతో కొందరు ఆత్మహత్య చేసుకుంటుంటే - కరోనా వైరస్  టెస్ట్ చేయిపించుకోమన్నందుకు మరికొందరిని హత్య చేస్తున్నారు. తాజాగా జార్ఖండ్‌ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జార్ఖండ్‌ లో ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదుకాలేదు. కానీ, కరోనా కారణంగా ఒకరు మృతి  చెందటం అత్యంత విషాదకరం.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ..  వేరే రాష్ట్రాలకు పనులకి వెళ్లి వచ్చిన నలుగురు కుర్రాళ్లు లాక్‌ డౌన్ తర్వాత నానా తంటాలు పడి సొంతూరికి వచ్చారు. పోనీ వచ్చినవాళ్లు ఇంటికే పరిమితమయ్యారా అంటే అదీ లేదు. దొరికిందే టైమ్ అంటూ ఊరంతా తిరగడం మొదలు పెట్టారు. ఇది చూసిన కాశీ షా అనే 45 ఏళ్ల పెద్దాయన వారిని నిలదీశాడు. లాక్‌ డౌన్ టైమ్‌ లో మీరు ఇంట్లో ఉండకుండా బయట ఎందుకు తిరుగుతున్నారంటూ ప్రశ్నించాడు. మీరు ఎక్కడి నుంచో వచ్చి.. ఇప్పుడు ఆ కరోనాను ఇక్కడి ప్రజలకు అంటిస్తారా? అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసాడు.

కరోనా కారణంగా  మీరు - ఇంకో ప్రదేశం నుండి వచ్చారు కాబట్టి  ఇళ్లలోనే ఉండండి అంటూ గట్టిగా అరిచేసరికి.. చుట్టుప్రక్కల ఇళ్లల్లోంచి జనం గబగబా బయటకు వచ్చేశారు. దీనితో  యువకులకి పట్టారని కోపం వచ్చింది. వెంటనే అక్కడ ఉన్న కర్రలతో తీవ్రంగా ఆ 45 ఏళ్ల వ్యక్తిని చితకబాది.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనితో వెంటనే స్థానికులు  ఆంబులెన్స్‌ కి సమాచారం ఇచ్చారు.  దెబ్బలతో పడి ఉన్న కాశీ షాను కమ్యునిటీ హెల్త్ కేర్ సెంటర్‌ కి తీసుకెళ్లారు. అయితే , అప్పటికి తీవ్రమైన రక్త స్రావం కావడంతో మృతి చెందాడు.  ఈ విషయం కాస్తా పోలీసుల వరకూ చేరడంతో కేసు నమోదు చేసి -- ఈ ఘటన పై  విచారణ  చేస్తున్నారు.
Tags:    

Similar News