ట్ర‌క్కులో 39 మృత‌దేహాలు..ఆశ్చ‌ర్య‌పోయే నిజాలు

Update: 2019-10-26 16:17 GMT
బ్రిట‌న్ చ‌రిత్ర‌లోనే...ఏనాడు లేనంత విషాదక‌ర సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. 39 మంది అంతుచిక్క‌ని రీతిలో మ‌ర‌ణించిన  ఉదంతం ఆ దేశంలో క‌ల‌క‌లం సృష్టిస్తోంది. లండన్ లో ఓ భారీ ట్రక్కులో 39 మృత దేహాలు కనబడిన అంశం అంత‌ర్జాతీయంగా సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. రెండు రోజుల క్రితం లండన్‌ లో వెలుగులోకి వచ్చిన ఈ 39 మృతదేహాలను గుర్తించేందుకు బ్రిటన్ దర్యాప్తు అధికారులు చర్యలను తీవ్రం చేశారు. మృతులంతా చైనీయులేనని భావిస్తుండ‌గా...వియ‌త్న వాసులు సైతం ఉన్నార‌ని తెలుస్తోంది. 11 మంది మృతదేహాలను సమీప దవాఖానకు తరలించారు.ఆ డెడ్ బాడీల్లో ఆరింటిని వియత్నాం కు చెందినవారివిగా గుర్తించారు. మానవ అక్రమ రవాణా కింద ఈ కేసు దర్యాప్తును విస్తరించడానికి పోలీసులు చర్యలు చేపట్టనున్నారు. వారెలా మరణించారన్న సంగతిని నిర్ధారించేందుకు పోస్ట్‌ మార్టం నివేదికలు దోహదపడతాయని చెబుతున్నారు.

కంటెయినర్‌ ను నడుపుకుంటూ వచ్చిన డ్రైవర్‌ ను పోలీసులు ప్రశ్నించేందుకు స్థానిక కోర్టు మరో 24 గంటల సమయం ఇచ్చింది. దీంతో ఆ డ్రైవర్‌ ను అధికారులు శుక్రవారం కూడా ప్రశ్నించనున్నారు. ఇదిలాఉండ‌గా, మృతులను కంటెయినర్‌ లో అతి శీతల ఉష్ణోగ్రత -25 డిగ్రీల స్థాయికి తీసుకొచ్చి కిరాతకం గా చంపారని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. మృతుల్లో ఒక‌రైన  26 ఏళ్ళ ‘ ఫామ్ థీ ట్రా ‘ అనే యువతి విషాదాంతం వెల్లడైంది. మంచి ఉద్యోగం - మెరుగైన జీవితం కోసం బ్రిటన్ వెళ్లే ప్రయత్నంలో ఆమె మొదట చైనాకు - ఆ తరువాత ఫ్రాన్స్ కు ప్రయాణించింది. అయితే బ్రిటన్ వెళ్ళడానికి ఆమె స్మగ్లర్లకు 30 వేల పౌండ్లు చెల్లించిందట. కానీ ఈ ప్రయాణం మధ్యలో అపస్మారక స్థితిలో ఈ వాహనంలో చేరింది. తాను శ్వాస తీసుకోలేకపోతున్నానని - చాలా ఇబ్బందిగా ఉందని ఈమె తన తల్లికి పంపిన టెక్స్ట్ మెసేజుల్లో పేర్కొంది. ఈ యువతి మాదిరే 20 ఏళ్ళ ‘ దిన్ లాంగ్ ‘ అనే యువకుడు కూడా మనుషులను అక్రమ రవాణా చేసే స్మగ్లర్ల బారిన పడి క‌న్నుమూశాడు.

లండన్‌లో చైనా కాన్సుల్ జనరల్ టోంగ్ జ్యూజౌన్ సారథ్యంలోని చైనా అధికారుల బృందం.. కంటెయినర్ గల ప్రాంతాన్ని సందర్శించారు. మృతులు ఏ దేశం వారన్న దానిని త్వరగా నిర్ధారించాలని పోలీసు అధికారులను కోరారు. ఎస్సెక్స్ డిప్యూటీ పోలీస్ చీఫ్ పిప్పా మిల్స్ ఈ ఘ‌ట‌న‌పై స్పందిస్తూ ``అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డిజాస్టర్ విక్టిమ్ ఐడెంటిఫికేషన్ (డీవీఐ) ప్రకారం మృతదేహాల గుర్తింపునకు చర్యలు చేపట్టాం. ఈ ప్రక్రియ మరికొంత సమయం పట్టవచ్చు ``అని చెప్పారు. బీజింగ్ కేంద్రంగా పని చేస్తున్న రాజకీయ విశ్లేషకుడు హువా పో స్పందిస్తూ.. అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అనుసరిస్తున్న సంప్రదాయ విధానాల వల్లే చైనీయులు యూరప్ దేశాలకు పారిపోతున్నారని పేర్కొన్నారు. `ప్రైవేట్ సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో నిరుద్యోగం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వారంతా యూరప్ దేశాలకు పారిపోతున్నారు` అని హువా పో మండిప‌డ్డారు.


Tags:    

Similar News