ఈ ఫ్రెండ్ గురించి వింటే ఫిదా కావాల్సిందే

Update: 2017-08-07 03:30 GMT
స్నేహం.. స్నేహితుడు ప్ర‌తిఒక్క‌రి జీవితంలో కీ రోల్ ప్లే చేస్తారు. అయితే.. స్నేహితులంతా ఒకేలా ఉంటారనుకుంటే త‌ప్ప‌లో కాలేసిన‌ట్లే. స్నేహితుల దినోత్స‌వం వేళ ఒక స్నేహితుడి గురించి బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మాచారం ఆస‌క్తిక‌రంగా ఉండ‌ట‌మే కాదు.. ఆ ఉదంతం గురించి చ‌దివిన వెంట‌నే ఫిదా కావ‌టం ఖాయం.

స్నేహానికి.. స్నేహితుడికి ఒక విదేశీయుడు ఇచ్చిన విలువ‌.. గౌర‌వం గురించి వింటే.. ఈ రోజుల్లో ఇలాంటి స్నేహితులు ఉన్నారా? అని అనుకోకుండా ఉండ‌లేం. తెలంగాణ‌లోని నిర్మ‌ల్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం సినిమాటిక్ గా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

నిర్మ‌ల్ లోని సోమ‌వార్‌ పేట‌కు చెందిన విద్యాసాగ‌ర్ స్వామి అమెరికాలోని మార‌థాన్ పెట్రోలియం సంస్థ‌లో ప‌ని చేస్తుంటారు. ఆయ‌న స్నేహితుడు మ‌సారు విలియ‌మ్స్‌. జ‌పాన్ కు చెందిన ఇత‌గాడు అమెరికాలో స్థిర‌ప‌డ్డారు. వీరిద్ద‌రూ మంచి స్నేహితులు. గ‌త ఏడాది విద్యాసాగ‌ర్ తో పాటు ఇండియాకు వ‌చ్చిన మ‌సారు.. కొన్నిరోజులు విద్యాసాగ‌ర్ ఇంట్లో గ‌డిపాడు.  ఆ సంద‌ర్భంగా ఆ ఫ్యామిలీతో అనుబంధాన్ని పెంచుకున్నాడు.

ప‌ది రోజుల క్రితం విద్యాసాగ‌ర్ తండ్రి సుద‌ర్శ‌న‌స్వామి మ‌ర‌ణించారు. వెంట‌నే స్వ‌దేశానికి బ‌య‌లుదేరాడు. స్నేహితుడి తండ్రి మ‌ర‌ణ‌వార్త‌ను విన్న మ‌సారు సైతం అత్య‌వ‌స‌ర వీసా తీసుకొని నిర్మ‌ల్‌ కు వ‌చ్చారు. ద‌శ‌దిన క‌ర్మ‌ల్లో స్నేహితుడి కుటుంబ స‌భ్యుల‌తో పాటు పాల్గొన్న మ‌సారు.. తానూ గుండు గీయించుకొని.. పంచె క‌ట్టుకొని మ‌రీ ఆ క్ర‌తువుల్లో పాల్గొన‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

త‌న స్నేహితుడి తండ్రి మ‌ర‌ణం త‌న‌ను క‌లిచివేసింద‌ని.. ఆయ‌న ఆద‌ర‌ణ త‌న క‌ళ్ల ముందు క‌దిలింద‌ని.. క‌ష్ట‌కాలంలో కాకుంటే స్నేహితుడి ద‌గ్గ‌ర ఇంకెప్పుడు ఉంటాన‌ని చెప్పిన  మ‌సారు.. అందుకే తాను అమెరికా నుంచి నిర్మ‌ల్ వ‌చ్చిన‌ట్లుగా చెప్పారు. ఇక్క‌డి సంప్ర‌దాయాలు బాగున్నాయ‌ని.. పెద్ద‌వారిని గౌర‌వించే ప‌ద్ద‌తులు బాగున్న‌ట్లుగా చెప్పారు. వీరి స్నేహం గురించి విన్న వారంతా ఫిదా అయిపోతున్నారు. ఇవాల్టి రోజుల్లో ఇలాంటి స్నేహితుడు ఉండ‌టం నిజంగానే గొప్ప‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News