మోడీ పెట్రో బాదుడు లెక్క తెలిస్తే షాకే!

Update: 2018-09-11 05:01 GMT
అంత‌కంత‌కూ పెరుగుతున్న పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల నేప‌థ్యంలో అందుకున్న కార‌ణాలేమిటంటూ ప్ర‌శ్నించిన ప్రతిసారీ కేంద్ర‌ప్ర‌భుత్వం చెప్పే మాట‌లు రోటీన్ అన్న విషయం తెలిసిందే. పెట్రో ధ‌ర‌ల మంట‌ల‌కు అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌టం ఒక కార‌ణంగా.. రూపాయి ప‌త‌నం మ‌రో కార‌ణంగా చెప్ప‌టం మామూలే. అయితే.. ఈ రెండు వాద‌న‌ల్లో మొద‌టిదైన అంత‌ర్జాతీయ కార‌ణాల‌కు సంబంధించిన లోతుల‌కు వెళితే షాకే.

ఎందుకంటే.. అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు పెరిగిన‌ప్పుడు మాత్ర‌మే పెంచిన‌ట్లుగా చెప్పే మోడీ స‌ర్కారు.. అదే స‌మ‌యంలో ముడిచ‌మురు ధ‌ర‌లు భారీగా త‌గ్గిన‌ప్పుడు ఆ ఫ‌లాల్ని ప్ర‌జ‌ల‌కు అందించ‌లేదు. ఒక ర‌కంగా చెప్పాలంటే.. అంత‌ర్జాతీయంగా ముడి చ‌మురు ధ‌ర‌లు త‌గ్గిన‌ప్పుడు మోడీ స‌ర్కారు పెద్ద పండుగ‌నే చేసుకున్నాయి. చాలా సింఫుల్ గా లెక్క చూస్తే.. యూపీఏ హ‌యాంలో బ్యారెల్ ముడిచ‌మురు ధ‌ర 110 డాల‌ర్ల‌ను దాటింది.

అయితే.. మోడీ అధికారంలోకి వ‌చ్చిన కొద్ది రోజుల‌కే ముడి చ‌మురు ధ‌ర త‌గ్గుముఖం ప‌ట్ట‌టం జ‌రిగింది. చివ‌రికి కనిష్ఠంగా 2015-16 నాటికి బ్యారెల్ ముడిచ‌మురు ధ‌ర 40 డాల‌ర్ల‌కు త‌గ్గిపోయింది. 110 డాల‌ర్లు ఉన్న ధ‌ర కాస్తా 40 డాల‌ర్ల‌కు త‌గ్గిపోతే.. అందుకు సంబంధించిన ఫ‌లాల్ని ప్ర‌జ‌ల‌కు అందించాల్సి ఉన్నా.. ఆ ప‌ని చేయ‌లేదు మోడీ స‌ర్కారు.

పెట్రోల్ ధ‌ర‌లు పెంచిన స‌మ‌యంలో సుంకాల్ని త‌గ్గించుకోవాల‌న్న రాష్ట్ర ప్ర‌భుత్వాల మాట‌కు కౌంట‌ర్ గా.. రాష్ట్ర స్థాయిలో విధించే వ్యాట్ కు కోత పెట్టుకోండంటూ ఉచిత స‌ల‌హా ఇవ్వ‌టం క‌నిపిస్తుంది. మొత్తంగా తాను ధ‌ర‌లు త‌గ్గించాల్సిన ప్ర‌తిసారీ.. రాష్ట్రాల వైపు వేలు చూపించి దాట‌వేత కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ద‌ర్శించింది.

ధ‌ర‌ల త‌గ్గింపు విష‌యంలో మోడీ స‌ర్కారు ప్ర‌ద‌ర్శించిన మాయ అంతా ఇంతా కాదు. 2018-19 నాటి బ‌డ్జెట్ లో ఎక్సైజ్ సుంకాన్ని రూ.2 త‌గ్గించి.. అద‌న‌పు ఎక్సైజ్ డ్యూటీ రూ.6 ర‌ద్దు చేసింది. అంటే.. లీట‌రుకు రూ.8 త‌గ్గించిన‌ట్లుగా చెప్ప‌గా.. ప్ర‌జ‌లు ఊర‌ట చెందారు. కానీ.. దాని ప్ర‌యోజ‌నం మాత్రం ప్ర‌జ‌ల‌కు ల‌భించ‌లేదు. ఒక చేత్తో ధ‌ర‌లు తగ్గించిన‌ట్లుగా చెబుతునే.. మ‌రో చేత్తో రోడ్డు సెస్ పేరుతో లీట‌రుకు రూ.8 చొప్పున బాద‌టం షురూ చేసింది. అంటే.. ఒక చేత్తో ధ‌ర త‌గ్గించిన‌ట్లుగా చెబుతూనే.. మ‌రో చేత్తో అంతే మొత్తాన్ని పెంచార‌న్న మాట‌.

మ‌రో షాకింగ్ అంశం ఏమంటే.. పెట్రోలియం ఉత్ప‌త్తుల‌పై 2012-13లో(యూపీఏ 2 హ‌యాంలో)  కేంద్రానికి ల‌భించిన ఆదాయం రూ.1,00,339 కోట్లు. ఆ త‌ర్వాతి ఏడాది ఈ మొత్తం రూ.1,06,091 కోట్ల‌కుపెరిగింది. మోడీ మాష్టారు అధికారంలోకి వ‌చ్చిన 2014-15లో పెట్రో ఆదాయం దూసుకెళ్ల‌టం జ‌రిగింది. ఆ  ఏడాది ఆదాయం ఏకంగా రూ.1,26,219 కోట్ల‌కు చేరింది.

త‌ర్వాతి ఏడాది అయితే ఏకంగా రూ.2,09,536 కోట్ల‌కు చేరింది. ఇక‌.. 2016-17 నాటికి పెట్రో ఆదాయం రూ.2,73,502 కోట్ల‌కు ఎగ‌బాకింది. అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు త‌గ్గిన‌ప్ప‌టికీ.. సుంకాల వ‌డ్డింపులో ఏ మాత్రం క‌నిక‌రం ప్ర‌ద‌ర్శించ‌ని కార‌ణంగా కేంద్ర ఖ‌జానాకు భారీగా నిధులు నిండ‌గా.. ఆ మేర‌కు జ‌నం జేబుల‌పై భారం అంతేగా కొన‌సాగింది. గ‌డిచిన ఐదేళ్ల‌లో పెట్రో ఆదాయం ఖాతా కేంద్రానికి మూడు రెట్లు ఎక్కువ ఆదాయం ల‌భించ‌టం గ‌మ‌నార్హం. ఈ రోజున రికార్డు స్థాయికి పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు పెరిగిన‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల‌పై భారం భారీగా మోప‌ని రీతిలో కాస్త క‌నిక‌రించేందుకు మోడీ స‌ర్కారు అస్స‌లు ఆలోచించ‌ని వైనం క‌నిపిస్తోంది.


Tags:    

Similar News