సీఎం చేతిలో 5వేల కోట్లు..మంత్రులకు 25కోట్లు

Update: 2016-03-07 04:42 GMT
డబ్బులున్న అసామి తీరే వేరుగా ఉంటుంది. డబ్బులు ఉండటం మాత్రమే కాదు.. వాటిని ఎలా వినియోగించాలన్న ఆలోచనతో పాటు.. విజన్ కూడా కలగలిస్తే ఎలా ఉంటుందన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను చెప్పొచ్చు. దూరదృష్టితో పాటు.. దేన్ని.. ఎలా చేయాలన్న విషయంలో ప్లానింగ్ ఆయన తర్వాతే. తాజాగా నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో చాలానే నిర్ణయాలు తీసుకున్నా.. ఒక నిర్ణయం మాత్రం అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి.. మంత్రుల పేరిట ప్రత్యేక అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయటమే కాదు.. అందులో భారీ నిధులు కేటాయించనున్నారు. ఈ నిధులతో అత్యవసర పనులు.. అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టే వీలుంది. జిల్లాల్లో పర్యటించే సందర్భంగా రకరకాల హామీలు ఇవ్వాల్సి రావటం.. వాటికి నిధులు కేటాయించే విషయంలో తలెత్తే తలనొప్పులకు పరిష్కారంగా తాజా నిర్ణయాన్ని చెప్పొచ్చు.

ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో సీఎం అకౌంట్లో ఏటా రూ.5వేల కోట్లు.. మంత్రుల ఖాతాలో రూ.25 కోట్ల చొప్పున నిధులు ఉంటాయి. జిల్లాలు పర్యటించే సందర్భంగా సమయానికి తగ్గట్లు ఏదైనా అంశంపై స్పందించాల్సి వస్తే.. సందేహంతో కాకుండా నేరుగా స్పందించే అవకాశం ఉంటుంది. సీఎం.. మంత్రులకు సంబంధించి తమ ఖాతాల్లో డబ్బులుభారీగా ఉంటాయి కాబట్టి.. హామీల అమలు విషయంలో లెక్క తేడా వచ్చే అవకాశం ఉండదు. తాజా నిర్ణయంతో.. ముఖ్యమంత్రి మరింత పవర్ ఫుల్ గా మారితే.. మంత్రులు సైతం అదే రీతిలో మరింత పవర్ ఫుల్ గా తయారు కావటం ఖాయం. పవర్ తో పాటు.. చేతిలో డబ్బులు కూడా ఉంటే ఆ హడావుడే వేరు. ఇకపై.. ఆ తరహా సందడి తెలంగాణ మంత్రుల దగ్గర చూసే అవకాశం కలగనుంది. ఏమైనా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొనగాడండోయ్.
Tags:    

Similar News