గుండెలో బుల్లెట్ సాక్షిగా బాబును హత్తుకున్న గద్దర్

Update: 2018-11-29 04:27 GMT
రాజకీయ ఆకాంక్షలు - పదవీ కాంక్ష - పుత్ర ప్రేమ వంటివి ఎంతటివారినైనా రాజీపడేలా చేస్తాయి.. పాత గాయాలను మరిచి గేయాలు పాడేలా చేస్తాయి..ఇప్పుడు ప్రజా యుద్ధనౌక గద్దర్ విషయంలోనూ అలాగే జరిగినట్లుంది. ఇప్పటికే ఆయన దిల్లీ వచ్చి కాంగ్రెస్ పెద్దలను కలవడం ఆయన అభిమానులకు నిరాశ కలిగించగా తాజాగా పోరాటాల పురిటిగడ్డ ఖమ్మంలో ఆయన రాహుల్ గాంధీ-చంద్రబాబులు పాల్గొన్న సభలో పాల్గొని పాటలు పాడడమే కాకుండా చంద్రబాబుతో అలయ్ భలయ్ కూడా చేశారు.
   
చంద్రబాబును హత్తుకుంటే తప్పేంటీ అనుకోవచ్చు.. తప్పులేదు, కానీ, గత చరిత్ర తెలిసినవారికి ఇది మింగుడుపడడం లేదట. సరిగ్గా 21 ఏళ్ల కిందట ఏప్రిల్ 6న గద్దర్‌‌ పై హత్యాయత్నం జరిగింది. ఆ సమయంలో ఆయన ఒంట్లోకి చాలా తూటాలు దూసుకెళ్లాయి. అయినా, ఆయన బతకడం అదృష్టమనే చెబుతారు. డాక్టర్లు ఆయన ఒంట్లోని అన్ని తూటాలను తొలగించారు కానీ ఒక్కటి మాత్రం తీయలేకపోయారు. అది నేరుగా గుండెను తాకుతూ ఉండడంతో దాన్ని తొలగించడం ప్రమాదమని అలాగే ఉండనిచ్చారు. ఇప్పటికే ఆయన గుండెను తాకుతూ బుల్లెట్ శరీరంలో ఉంది.
   
ఆ దాడి జరిగే సమయానికి ముఖ్యమంత్రి గా చంద్రబాబే ఉన్నారు. ఆ దాడి ప్రభుత్వం పనేనని గద్దర్ నిన్న మొన్నటి వరకు ఆరోపించేవారు. పోలీసులే ఆ దాడి చేయించారని అనేవారు. అంతెందుకు తెలంగాణ ఏర్పడ్డాక మళ్లీ ఆ కేసును తిరగతోడి తనకు బాధ్యులను శిక్షించాలంటూ ఆయన 2017లో కూడా తెలంగాణ డీజీపీని కోరారు. కానీ... ఇటీవల ఆయన స్టాండ్ మారింది. తొలుత తాను రాజీకయంగా ఎదగాలని ప్రయత్నించి అవకాశాలు కనిపించక సైలెంటయ్యారు.  పార్టీ పెడతామన్నారు. కేసీఆర్ పై పోటీ చేస్తామన్నారు. చివరకు కుమారుడిని తీసుకుని వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిశారు. కానీ, కుమారుడికి టిక్కెట్ రాలేదు. అయితే.. కేసీఆర్‌ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానంటూ ప్రజాకూటమితో చేతులు కలిపారు. 
   
అదిగో.. ఆ ఫలితమే ఇప్పుడు చంద్రబాబుతో అలా భుజం భుజం కలపాల్సి వచ్చింది. అంతేకాదు.. చంద్రబాబును ఒక మోస్తరుగా పొగిడారు కూడా. మొత్తానికి ‘అన్న ఎన్టీవోడు ఉన్నాడు చూడు.. ఆడు మాయగాళ్లకు మాయగాడు’ అని పాటలు పాడిన నోరే ఆ పార్టీని - పార్టీ నేతలను పొగుడుతోంది.


Tags:    

Similar News