గ‌ద్ద‌ర్ కొడుకు కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు

Update: 2018-04-25 05:01 GMT
ప్ర‌జా గాయ‌కుడిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుప‌రిచితుడైన గ‌ద్ద‌ర్ కుమారుడు సూర్య కిర‌ణ్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేత‌ల మీదుగా ఆయ‌న పార్టీలోకి చేర‌నున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌జా రాజ‌కీయాల‌కు ఏ మాత్రం సంబంధం లేని రీతిలోజీవ‌నం సాగిస్తున్న ఆయ‌న రాజ‌కీయాల్లోకి రావాల‌నుకోవ‌టం అనూహ్య‌మేమీ కాద‌ని చెబుతున్నారు. కొద్దికాలంగా రాజ‌కీయాల్లోకి రావాల‌న్న అభిలాష ఉన్న‌ప్ప‌టికీ.. చుట్టూ ఉన్న ప‌రిస్థితుల కార‌ణంగా ఆయ‌న త‌న నిర్ణ‌యాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా వేసుకున్న‌ట్లు చెబుతారు.

ఒక ద‌శ‌లో ఆయ‌న రాజ‌కీయ ఎంట్రీ కోసం ఎంచుకున్న పార్టీ విష‌యంలో సొంతిట్లోనే తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంద‌ని.. అస‌లు రాజ‌కీయాల్లోకి రావాలా?  వ‌ద్దా?  అన్న అంశంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగిన అనంత‌రం.. చివ‌ర‌కు కాంగ్రెస్ లోకి ఆయ‌న చేరేందుకు నిర్ణ‌యించుకున్న‌ట్లుగా చెబుతారు.  ఇప్ప‌టివ‌ర‌కూ నేష‌న‌ల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ.. పొట్టిగా చెప్పాలంటే నిఫ్ట్ లో రీసెర్చ్ అసోసియేట్ గా ప‌ని చేస్తున్న సూర్య‌కిర‌ణ్.. రానున్న సార్వ‌త్రిక ఎన్నికల బ‌రిలో నిలుచునేందుకు వీలుగా కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న‌ట్లుగా చెబుతున్నారు.

స‌న్నిహితుల స‌మాచారం ప్ర‌కారం రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కంటోన్మెంట్ నుంచి సూర్య కిర‌ణ్ పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఒక‌వేళ అది సాధ్యం కాని ప‌రిస‌థితుల్లో బెల్లంప‌ల్లి.. జుక్క‌ల్ స్థానాల నుంచి బ‌రిలోకి దిగాల‌ని భావిస్తున్న ఆయ‌న పార్టీకి సంబంధించిన ఏ ప‌నినైనా చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

ఎంత విప్ల‌వ నేత కుమారుడినైనా.. రాజ‌కీయాల‌కు సంబంధించి స్వ‌తంత్ర నిర్ణ‌యం తీసుకునే హ‌క్కు త‌న‌కుంద‌న్న ఆయ‌న‌.. త‌న రాజ‌కీయ నిర్ణ‌యంలో త‌న తండ్రి గ‌ద్ద‌ర్ కు ఎలాంటి సంబంధం ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

తాజాగా గ‌ద్ద‌ర్ కుమారుడు సూర్య‌కిర‌ణ్ తో పాటు..  బీజేపీ నేత నాగం జ‌నార్ద‌న్ రెడ్డి.. వేముల‌వాడ బీజేపీ నేత‌ల ఆది శ్రీ‌నివాస్ లు.. కాంగ్రెస్‌ లో చేర‌నున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ముగ్గురు నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న నేప‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన నేత‌లు ఎవ‌రూ ఢిల్లీకి రావాల్సిన అవ‌స‌రం లేద‌ని.. పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ స్ప‌ష్టం చేయ‌టంతో ఎవ‌రూ వెళ్ల‌లేద‌ని చెబుతున్నారు.


Tags:    

Similar News