గడ్కరీ మీద అవినీతి మరక పడిందిగా.. ఇంతకీ ఏ ఇష్యూలో?

Update: 2021-03-12 04:04 GMT
ఏడేళ్లలో ఎప్పుడూ లేని రీతిలో మోడీ ప్రభుత్వంలోని మంత్రివర్గ సభ్యుల్లో ఒకరిపై అవినీతి అంశం హాట్ టాపిక్ గా మారటం షాకింగ్ గా మారింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనంగా మారిన కేంద్ర మంత్రులు ఉన్నారే కానీ.. అవినీతి మరక అంటుకున్న మంత్రులు ఎవరూ లేరు. తాజాగా కేంద్రమంత్రుల్లో సీనియర్.. బీజేపీలో బలమైన వర్గానికి నేతగా చెప్పుకునే నితిన్ గడ్కరీపై అనూహ్యంగా అవినీతి మరక అంటినట్లుగా ఆరోపణలు వచ్చాయి. స్వీడన్ కు చెందిన బస్సు కంపెనీ కారణంగా ఇప్పుడాయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

స్వీడన్ మీడియాలో భారీగా వచ్చిన మీడియా కథనాలతో ఈ కలకలం మొదలైంది. ఆ అంశంపై భారత మీడియా ఇప్పుడు ఫోకస్ చేస్తోంది. ఇంతకీ గడ్కరీ మీద ఆరోపణ ఏమిటన్నది చూస్తే.. స్వీడన్ కు చెందిన స్కానియా కంపెనీ గడ్కరీ కొడుకులతో సంబంధాలున్న ఒక భారతీయ కంపెనీకి ప్రత్యేక హంగులు సమకూర్చిన లగ్జరీ బస్సును కానుకగా పంపినట్లు పేర్కొంటున్నారు. ఈ బస్సును కుమార్తె పెళ్లి సమయంలో వాడినట్లుగా స్వీడన్ వార్తా సంస్థలు సంచలన కథనాన్ని పబ్లిష్ చేశాయి.

2016 నవంబరులో జరిగినట్లుగా చెబుతున్న ఈ ఘటన కంపెనీ అంతర్గత ఆడిట్ లో బయటకు వచ్చినట్లుగా మీడియా కథనాలు చెబుతున్నాయి. భారత్ లోని తమ కంపెనీ ప్రతినిధులు బస్సు కాంట్రాక్టుల కోసం స్థానిక అధికారులకు రూ.56 లక్షలు (మన రూపాయిల్లో)లంచాలు ఇచ్చినట్లుగా కూడా సదరు ఆడిట్ లో బయటకు వచ్చినట్లుగా పేర్కొనటం గమనార్హం. అయితే.. ఈ ఆరోపణలన్ని కట్టుకథలుగా గడ్కరీ కార్యాలయం తీవ్రంగా ఖండించింది. తాము గడ్కరీకి బస్సు అమ్మలేదని స్కానియా అధికార ప్రతినిధి పేర్కొన్నట్లుగా రాయటర్స్ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. చూస్తుంటే.. రానున్న రోజుల్లో గడ్కరీని ఈ కొత్త ఆరోపణ ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News