భాషలో ట్రైనింగ్‌ ఇవ్వాలంటున్న ముద్దుకృష్ణమ

Update: 2015-07-09 09:31 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు సంధించటంలో చాలామంది తెలుగుదేశం నేతలు ఆచితూచి వ్యవహరిస్తారు. ఏపీకి చెందిన నేతల్లో పలువురు.. ఎలాంటి స్థితిలోనూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై విమర్శలు చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించారు.

కానీ.. గాలి ముద్దుకృష్ణమ లాంటి నేతలు ఇలాంటివి చాలా లైట్‌ తీసుకుంటారు. ఆయనకు అవకాశం దొరకాలే కానీ.. గంటకోసారి చొప్పున కేసీఆర్‌ను విమర్శించేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తారు. నిన్నటి వరకూ ఎలాంటి పదవి లేని పరిస్థితుల్లోనే విమర్శలు చేసే ఆయన.. తాజాగా ఎమ్మెల్సీ అయిన ఉత్సాహంతో రెట్టించి మాట్లాడటం ఖాయమని చెబుతున్నారు.

దీనికి తగ్గట్లే తాజాగా మరోసారి గాలి ముద్దుకృష్ణమ నోరు విప్పారు. డీఎస్‌నుపార్టీలోకి చేర్చుకున్న సందర్భంగా ఏపీ  ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేసిన కేసీఆర్‌ వైఖరిని గాలి తప్పు పట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్‌ వాడే భాష ఏమాత్రం బాగోలేదని.. ఆయన మాట్లాడే భాషకు సంబంధించి శిక్షణ ఇవ్వాలన్నారు.

ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవటంలో ఆలీబాబా దొంగల్ని కేసీఆర్‌ మించిపోయారని చెప్పిన ఆయన.. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను వదిలేసి ఆంధ్రావాళ్లను పదే పదే వెళ్లిపోవటం సరికాదన్నారు.

కేసీఆర్‌ మీద ఘాటుగా రియాక్ట్‌ అయ్యే గాలి.. జనసేన అధినేత పవన్‌ విషయంలో మాత్రం ఆచితూచి మాట్లాడారు. సాయం చేసే వ్యక్తిగా పవన్‌ను అభివర్ణించిన ఆయన.. పవన్‌ తమ శ్రేయోభిలాషి అని.. ఆయన్ను తాము గౌరవిస్తామంటూ.. రాజకీయాల్లో తనకున్న సీనియార్టీని గాలి ప్రదర్శించారు. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా మాట్లాడాలో గాలికి ఒకరు నేర్పించాల్సిన అవసరం ఉందా?



Tags:    

Similar News