‘ముద్దు’ ముచ్చట: పుత్తూరులో ఆయన ఎరగనోడెవడు!!

Update: 2018-02-07 05:55 GMT
ముద్దు అంటే మందిలో ఒకడు. పేదల్లో తాను నిరుపేద... సంపన్నుల్లో తాను కులీనుడు.. అవసరానికి పిలిస్తే పలికే నాయకుడు.. ఏ ఇంట్లో ఏం జరిగినా సరే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంట అడుగుపెట్టకుండా, భోం చేయకుండా వెళ్లని వ్యక్తి.. తన పరిధిలోని వారికి ఎలాంటి అవసరం వచ్చినా కూడా.. తాను పనిగట్టుకుని.. సొంత పనికోసం తిరిగినట్టుగా ఆఫీసుల చుట్టూ తిరిగి తన వారికోసం ఆ పనిచేసి పెట్టే నైజం గల వ్యక్తి. ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడు ప్రజల మనిషి అని పేరు తెచ్చుకోవడానికి ఇంతకంటె ఏం లక్షణాలు కావాలి?

ఒకే నియోజకవర్గంనుంచి వరుసగా ఆరుసార్లు విజయం సాధించడం అనేది అంత సులభమైన సంగతి కాదు. అలాంటి ఫీట్ ముద్దుకృష్ణమ నాయుడుకు సాధ్యమైంది. లెక్చరర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి.. ఎన్టీఆర్ పిలుపు అందుకుని 1983 లో రాజకీయ రంగప్రవేశం చేసిన ముద్దుకృష్ణమ.. తన నియోజకవర్గంలోని జనం మనసులను గెలుచుకునే టెక్నిక్ ను ఔపోసన పట్టిన తర్వాత.. ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. తన పార్టీ అధికారంలోకి వచ్చింది.. పోయింది.. ఇలాంటి పరిణామాలు అనేకం జరిగాయి. కానీ.. ఆయన మాత్రం ఓటమి చూడలేదు. చిత్తూరు జిల్లాలో తమిళ ప్రాంతానికి చాలా చేరువగా ఉండే పుత్తూరు నియోజకవర్గం ఆయనది. స్వగ్రామం కూడా అప్పట్లో అదే నియోజకవర్గం పరిధిలో ఉండేది. ఆ నియోజకవర్గం పరిధిలో మొత్తం అన్ని మండలాలు - అన్ని గ్రామాలు - పల్లెలు - వాడలు ప్రతి చోటా ఉండే ప్రతి మనిషినీ గుర్తించి పలకరించగల స్థాయిలో ఆయన వారితో సత్సంబంధాలు నెరపారు. అందుకే పుత్తూరు నియోజకవర్గం కూడా ఆయనను నెత్తిన పెట్టుకుంది. ఏకంగా ఆరుసార్లు వరుసబెట్టి అసెంబ్లీకి పంపించింది.

అన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు నియోజకవర్గంలో దాదాపుగా మారుమూల ఉండే ప్రతి మనిషికీ కూడా తెలిసి ఉండడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కానీ ఇక్కడ తమాషా ఏంటంటే... అలా మారుమూల గ్రామాల్లో ఉండే ఏ ఒక్కడూ కూడా ఆయన ఎరగని వాడు ఉండడు. అంతగా తన నియోజకవర్గం వరకు ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించేవారు. కానీ చిత్తూరు జిల్లాలో నియోజకవర్గాల్ని అడ్జస్ట్ చేసినప్పుడు.. ‘పుత్తూరు’ మాయమైపోయింది. ఆయనకు బాగా పట్టున్న కొన్ని మండలాలు వెళ్లి వేరే నియోజకవర్గాల్లో కలిశాయి. ఆయన అనివార్యంగా ‘నగరి’ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాల్సి వచ్చింది. అక్కడ ఆయన వైసీపీ కి చెందిన రోజా చేతిలో ఓటమి పాలయ్యారు. అయినా తర్వాత ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగుపెట్టారు. రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి అసువులు బాసేవరకు పూర్తిస్థాయిలో ప్రజల మనిషిగా మెలగిన ముద్దుకృష్ణమ సేవలు చిరస్మరణీయం అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
Tags:    

Similar News