టీడీపీ బెంచీల్లో టీఆరెస్ ఎంపీ

Update: 2018-07-20 07:00 GMT
   
తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపులు ప్రజాప్రతినిధులకు విచిత్రమైన పరిస్థితులను కల్పిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ నుంచి మల్కాజగిరిలో ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి ఆ తరువాత టీఆరెస్‌లో చేరిన సంగతి తెలిసిందే.  అప్పటి నుంచి ఆయన టీఆరెస్ సభ్యులతో కలిసి కూర్చుంటున్నారు. కానీ, ఆయన తన సభ్యత్వానికి రాజీనామా చేసి టీఆరెస్ నుంచి గెలవకపోవడంతో టెక్నికల్‌గా టీడీపీలోనే ఉన్నారు. తాజాగా లోక్ సభలో టీడీపీ అవిశ్వాసం పెట్టడం.. ప్రస్తుతం చర్చ జరుగుతుండడంతో టీడీపీ జారీ చేసిన విప్ మేరకు మల్లారెడ్డి ఈ రోజు టీడీపీ సభ్యులతో కూర్చోవాల్సి వచ్చింది.
    
అవిశ్వాసంపై చర్చను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రారంభించి ఏపీకి ఎలా అన్యాయం జరిగిందో చెప్తుంటే టీఆరెస్ సభ్యులు జయదేవ్ మాటలకు అభ్యంతరం చెబుతున్నారు. కానీ, అదే పార్టీకి చెందిన మల్లారెడ్డి మాత్రం జయదేవ్ పక్కనే కూర్చున్నారు. విప్ ను ధిక్కరిస్తే సభ్యత్వం పోతుంది కాబట్టి ఆయన టీడీపీతో పాటు కూర్చున్నారు.
    
కాగా.. పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్నిఅప్రజాస్వామికంగా విభజించారని.. అప్రజాస్వామిక విభజన కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయిందని జయదేవ్ అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించి ప్రసంగిస్తున్న గల్లాజయదేవ్..విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు విషయంలో కేంద్రం దారుణంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కాగా ఈ దశలో రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా విభజించారన్న జయదేవ్ వ్యాఖ్యలపై టీఆర్ ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. టీఆర్ ఎస్ సభ్యులపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ ఎస్ సభ్యుల నినాదాల మధ్యే జయదేవ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.  అన్ని విధాలుగా నష్టపోయిన ఏపీకి మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ న్యాయం చేయలేదని విమర్శించారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ విభజన హామీలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. అప్పులు ఏపీకీ, ఆస్తులు తెలంగాణకు ఇచ్చారన్నారు. వీటిపై టీఆరెస్ సభ్యులు లేచి నిల్చుని అభ్యంతరం చెప్తుండగా అదే పార్టీలో పనిచేస్తున్న మల్లారెడ్డి మాత్రం సాంకేతిక కారణాల వల్ల ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలతో కలిసి కూర్చున్నారు. మాట్లాడుతున్న జయదేవ్‌ కు పక్కనే కూర్చోవడంతో ఆయన మరింత స్పష్టంగా టీవీల్లో కనిపిస్తున్నారు.


Tags:    

Similar News