అమ‌రావ‌తికి పొరుగు రాష్ట్ర స్వామీజి ఆశీస్సులు

Update: 2017-01-21 07:00 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని అమరావతి కి మైసూరుకు చెందిన అవధూత దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామిజీ అనుగ్ర‌హ‌భాష‌ణం చేశారు. అమ‌రావ‌తి దేశానికే తలమానికం అవుతుందని చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఏమాత్రం అన్యాయం జరుగకుండా, ప్రతి ఒక్కరి ఆమోదంతో రాజధాని నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. నూతన రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పోలవరం ప్రాజెక్టుతో పాటు పలు పథకాలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉన్నాయని అన్నారు. స్థానిక శ్రీదత్తపీఠంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన వివిధ ప్రాజెక్టులు, ప‌నుల‌పై స్పందించారు.

గోదావరి జిల్లాలోని అంతర్వేదిని స్వయంగా చూశానని - ఎంతో విలువైన గోదావరి జలాలు నిరుపయోగంగా సముద్రంలో కలుస్తున్నాయని అవధూత దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామిజీ చెప్పారు. వృధాగా పోతున్న నీటిని వినియోగించుకుంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ దిశలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ...రైతులు అతివృష్టి - అనావృష్టి బారిన పడకుండా వృథాగా పోతున్న నీటిని వినియోగించుకునే విధంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు విజయవంతం అవుతాయని అవధూత దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామిజీ  అన్నారు. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురుస్తాయని, పాడి పంటలు వృద్ధిచెందుతాయని స్వామిజీ వివరించారు. ప్రతి ఒక్కరూ హింసా వాదాన్ని విడనాడి, శాంతియుత జీవనాన్ని సాగించాలని సూచించారు. అభివృద్ధి పనులు నిర్వహిస్తున్న విషయంలో ఎన్నో సంవత్సరాలు చరిత్ర కలిగిన చెట్లను నరకవద్దని, చెట్టు కూడా ప్రాణంతో సమానమని అవధూత దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామిజీ  అన్నారు. తమిళనాడులో జల్లికట్టు, తెలుగు రాష్ట్రాల్లో కోడిపందాలను న్యాయస్థానం నిషేధించటం సమంజసమేనని అన్నారు. అయితే సంస్కృతి - సంప్రదాయాలను కొనసాగించే విధంగా ఎటువంటి ప్రాణహాని - హింస లేకుండా వీటిని కొనసాగించాలని స్వామిజీ సూచించారు. రాబోయే ఉగాది పండుగ అందరి జీవితాల్లో వెలుగురు నింపుతుందని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News