గురువును వ‌దిలేసి సైకిలెక్క‌నున్న సీనియ‌ర్ నేత‌

Update: 2016-04-24 07:25 GMT
తెలుగుదేశం పార్టీలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ చేరిక దాదాపు ఖరారైనట్టు తెలిసింది. రాజకీయ గురువు కొణతాల రామకృష్ణతో కలసి పార్టీ మారాలని ఇప్పటి వరకూ వేసి చూసిన బాబ్జీ - ఇక సొంత నిర్ణయంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో ఓటమి అనంతరం వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన రెడ్డితో విభేదించి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన కొణతాల, ఆతర్వాత కొద్ది రోజులకే బయటికి వచ్చేశారు. మొదట్నుంచి కొణతాల వెంటే ఉన్న బాబ్జీ కూడా ఆయన మార్గాన్నే అనుసరించారు. వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరుతారని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది.

అయితే తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా వర్గాల అభ్యంత‌రాల నేపథ్యంలో కొణతాల చేరికపై ప్రతిష్ఠంభన నెలకొంది. కొణతాల చేరికను మొదట్నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్న నగరానికి చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావుపై ఆధిక్యాన్ని సాధించేందుకే మరో మంత్రి అయ్యన్నపాత్రుడు వీరి చేరికను ప్రోత్సహించారన్న ప్రచారం జరిగింది. ఇదే సందర్భంలో మంత్రి గంటా మరో అడుగు ముందుకేసి అనకాపల్లికే చెందిన మరో సీనియర్ నేత దాడి వీరభద్రరావును కూడా పార్టీలో చేర్చుకుంటే మంచిదన్న సంకేతాలిచ్చారు. ఈ విధంగా మంత్రులిద్దరూ తమ తమ వ్యూహాలను అమలు చేస్తూ వచ్చారు. ఇదే సందర్భంలో ముద్రగడ కాపు ఉద్యమంతో ఒక్కసారిగా సమీకరణలు మారిపోయాయి. మంత్రి గంటాకు వ్యతిరేకంగా కొణతాల చేరికపై నిర్ణయాన్ని అధినేత వాయిదా వేస్తూ వచ్చారు. కొణతాల చేరికలో జాప్యం జ‌రుగుతున్న నేప‌థ్యంలో బాబ్జీ త‌న గురువుతో సంబంధం లేకుండా సైకిలెక్కేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.
Tags:    

Similar News