అధికారపార్టీతో పెట్టుకొని అంతమయ్యాడా?

Update: 2016-08-09 04:53 GMT
నయిం... మూడక్షరాల పేరు. కానీ.. ఆ మాటకే వణికిపోయే వారెందరో. వ్యాపారులు.. అధికారులు.. ప్రజాప్రతినిధులు.. సంఘంలో పలుకుబడి ఉన్నోళ్లు ఇలా వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఎవరినైనా సరే బెదిరించటం.. తాను చెప్పినట్లుగా చేయాలనటం.. కాదంటే చంపించే అలవాటున్న నయిం ఎట్టకేలకు పోలీసు తూటాకు బలయ్యాడు. మావోయిస్టుగా చిరుప్రాయంలోనే తుపాకీ పట్టి.. పద్దెనిమిది.. పందొమ్మిదేళ్ల వయసులోనే సీనియర్ పోలీసు అధికారిని చంపేసిన ఇతగాడి వ్యవహారం చూస్తే.. ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక కరుడుగట్టిన నేరస్తుడికి పోలీసులు అండగా నిలవటం.. వారికి సాయం చేస్తున్నానన్న ముసుగులో భారీ ఎత్తున దందాలు చేపట్టటమే కాదు.. వ్యవస్థను తనకు తగినట్లుగా ఆడించేలా చేయటంలోనూ నయిం సిద్ధహస్తుడు.

అలాంటి నేరస్తుడి జీవితం నిన్నటితో ముగిసింది. యాభై ఏళ్ల వయసులో.. దశాబ్దాల తరబడి తాను ఎవరినైతే అడ్డుగా పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించాడో.. అదే వ్యవస్థకు చెందిన పోలీసుల తూటాలకే అతడు చివరకు బలి కావటం గమనార్హం. ఇంతకాలం ఎన్ని దందాలు చేసినా నడిచిపోయిన నయిం ఆరాచకం.. ఇప్పుడెలా అంతమైందన్న ప్రశ్న వేసుకుంటే.. ఆసక్తికర సమాధానం లభిస్తుంది.

మితిమీరిన ఆత్మవిశ్వాసం.. తానేం చేసినా నడిచిపోతుందన్న నమ్మకం.. పోలీసు శాఖలో తనకు సహకరించే కొందరు అధికారుల అండదండలు.. తనకు విశ్వాసపాత్రంగా ఉండే రాజకీయ నేతల అండతో.. భూదందాలు.. సెటిల్ మెంట్లు.. కాదూ కూడదంటే హత్యలకు తెగబడే నయిం.. ఇటీవల కాలంలో మరింత రెచ్చిపోవటమే అతడి ప్రాణాల్ని తీసేలా చేసిందన్న అభిప్రాయం పోలీసుల వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ అధికారపక్షానికి చెందిన పలువురు ఎమ్మెల్యేల్ని బెదిరించటమే కాదు.. వారి నుంచి పెద్ద ఎత్తున మొత్తాన్ని డిమాండ్ చేయటం.. ఈ ఆరాచకమేందంటూ వారు ప్రభుత్వ పెద్ద దగ్గర తమ గోడును వెళ్లబోసుకోవటంతో.. నయిం సంగతి తేల్చేయాలన్న స్పష్టమైన సందేశం నయిం ప్రాణాల్ని తీసిందని చెబుతున్నారు.

మెదక్.. నల్గొండ జిల్లాలకు చెందిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని నయిం నేరుగా వార్నింగ్ ఇవ్వటమే కాదు.. ఇటీవల మెదక్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లి.. ఆయనతోనే గొడవపడి.. అంతు చూస్తానని బెదిరించటం.. నియోజకవర్గంలో తిరిగితే అంతే సంగతులని చెప్పి వచ్చిన విషయం ముఖ్యమంత్రి వరకూ వెళ్లిందని చెబుతున్నారు. మరో అధికారపక్ష ఎమ్మెల్యేకు ఫోన్ చేసి మరీ బూతులు తిట్టిన వ్యవహారం పోలీసు శాఖకు చేరటం.. ఈ ఇష్యూను తేల్చేయాలంటూ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటంతో నయిం వేట ఆర్నెల్ల కిందటే షురూ అయ్యిందని చెబుతున్నారు.

తొలుత నయింకు సహకరించే రాజకీయ నేతలకు తీవ్రంగా హెచ్చరించిన పోలీసు శాఖ.. మరోవైపు తమ శాఖలో నయింకు అండగా నిలిచే వారికి.. తాము చేపట్టిన రహస్య ఆపరేషన్ కు సంబంధించిన సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ మధ్య ప్రాణభయంతో ఛత్తీస్ గఢ్ కు వెళ్లి తలదాచుకున్న నయిం.. ఈ మధ్యనే మళ్లీ రాష్ట్రానికి తిరిగి వచ్చినట్లు చెబుతారు. అధికారపార్టీ ఎమ్మెల్యేల్ని వార్నింగ్ లు ఇస్తున్న నేపథ్యంలో అతనిపై కన్నేసిన పోలీసు శాఖ.. అతడి కదలికలపై ప్రత్యేక దృష్టి సారించింది. తాజాగా షాద్ నగర్ వద్దకు వస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు.. పక్కా వ్యూహంతో అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించినా.. ఏకే 47 రైఫిల్ తో పోలీసులపై ఎదురుకాల్పులకు తెగబడిన నేపథ్యంలో హతమయ్యాడు. చట్టానికి చిక్కకుండా ఇన్నాళ్లు నయిం నడిపించిన దందా అతడి అత్యాశతో.. అంతమయ్యే పరిస్థితిని తెచ్చింది.
Tags:    

Similar News