న‌యీం మ‌నిషిని లేపేద్దామ‌ని చూసి బుక్క‌య్యారు

Update: 2017-09-29 19:09 GMT
గ్యాంగ్‌ స్టర్ నయీమొద్దీన్ అలియాస్ నయీం....2016 ఆగస్టు 8న షాద్‌ నగర్‌ లోని మిలీనియం కాలనీలో ఎన్‌ కౌంట‌ర్ ద్వారా ప్రాంతీయంగానే కాకుండా జాతీయ మీడియాలో కూడా అంద‌రి దృష్టిని తెలుగు రాష్ర్టాల‌పై ప‌డేలా చేసిన మాఫియా లీడ‌ర్‌. ఎన్‌ కౌంటర్ లో హతమైన గ్యాంగ్‌ స్ట‌ర్ నయీం కుటుంబ సభ్యులకు ఆదాయ పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేయ‌డం ద్వారా మ‌రోమారు న‌యీం ఉదంతం చ‌ర్చ‌కు వ‌చ్చింది. అయితే ఇప్పుడు మ‌రో రూపంలో ఆయ‌న ఉదంతం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. అదే నయీం అనుచ‌రుడిని లేపేసేందుకు చేసిన ప్ర‌య‌త్నం భ‌గ్నం అవ‌డం.

నయీం అనుచరుడు కోనాపురి శంకర్‌ ను హత్య చేసేందుకు ఓ ముఠా కుట్ర పన్నింది. అయితే అనుచరుడి హత్యకు కుట్ర పన్నిన ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ముందస్తు సమాచారం తెలుసుకున్న పోలీసులు గొల్లపల్లి వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో స్కార్ఫియోలో వెళ్తున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో ప్రధాన నిందితుడు కొమురవెల్లి ప్రదీప్‌ రెడ్డి కూడా ఉన్నాడని, వారి నుంచి కత్తులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

కాగా, జాతీయ స్థాయిలో సంచలనం రేపిన గ్యాంగ్‌ స్టర్ నయీమొద్దీన్ అలియాస్ నయీం ఎన్‌ కౌంటర్‌ లో హతమై ఏడాది దాటిపోయినప్ప‌టికీ... ఈ కేసును ఉద్దేశ‌పూర్వ‌కంగానే నీరుగార్చార‌ని...ప‌క్క‌దారి ప‌ట్టించార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. నయీంను ఎన్‌ కౌంటర్‌ చేసి, అతని నేర సామ్రాజ్యానికి అడ్డుకట్ట వేసిన పోలీస్‌ శాఖే గ్యాంగ్‌ స్టర్‌ మూలాలన్నిటినీ పెకలించి వేస్తుందని బాధితులు ఆశించారు. కానీ, ఇప్పటి వరకూ నయీంతో కలిసి ఘోరమైన నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలున్న కుడిభుజం శేషన్నతో పాటు అతని 30 మంది సభ్యుల ముఠా ఇంకా సిట్‌కు చిక్కక పోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాము గాలిస్తున్నామని... త్వరలో పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. బెదిరించి ,కిడ్నాప్‌ లకు పాల్పడి తమ నుంచి నయీం కబ్జా చేసిన వందల ఎకరాల భూమిని తిరిగి ఇప్పించే విషయమై ప్రభుత్వం నుంచి తగిన చర్యలు లేవని వందలాదిమంది బాధితులు వాపోతున్నారు. అదే సమయంలో శేషన్నవంటి కరడుగట్టిన గ్యాంగ్‌ స్టర్‌ పట్టుబడక పోవడంతో తాము ఫిర్యాదు చేస్తే చిక్కుల్లో పడాల్సి వస్తుందని మరి కొందరు బాధితులు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News