వైసీపీలోకి మాజీ మంత్రి గంటాతోపాటు టీడీపీ ఎమ్మెల్యే

Update: 2020-07-23 14:35 GMT
కేసులన్నీ చుట్టుమట్టడానికి సిద్ధమైన వేళ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. వచ్చే నెలలోనే టీడీపీకి గుడ్ బై చెప్పేసి అధికార వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఈ మేరకు సీఎం జగన్ తో చర్చలు ఫలించాయని.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఆగస్టు 15వ తేదీన అధికారపార్టీలో గంటా చేరుతారని సమాచారం అందుతోంది. జగన్ సన్నిహితుడితో జరిగిన చర్చలు ఫలించాయని ఈ మేరకు గంటా చేరికకు అంతా ఓకే చెప్పినట్టు తెలిసింది.

విశాఖ బాధ్యతలు చూస్తున్న విజయసాయిరెడ్డి, మంత్రి అవంతికి తెలియకుండానే జగన్ సన్నిహితుడితో గంటా చర్చలు జరిపారని.. ఫలించాయని అంటున్నారు.

టీడీపీ మాజీ మంత్రి గంటా టీడీపీ హయాంలో సైకిళ్ల కుంభకోణంలో అరెస్ట్ అవుతాడని  ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతిలు కొద్దిరోజుల క్రితం వ్యాఖ్యానించారు. దీంతో గంటాకు ఇక వైసీపీలోకి ఎంట్రీ ఉండదని భావించారు. అనూహ్యంగానే ఆయన వైసీపీలో చేరుతారని వార్తలు రావడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.

అయితే గంటా చేరికపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఆయన కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు తాజాగా వైసీపీలో చేరుతారనే ప్రచారం మళ్లీ రావడం గమనార్హం. ఓ పెద్ద నేత గంటాను వైసీపీలోకి చేర్చడానికి జగన్ ను ఒప్పించినట్టు ప్రచారం జరుగుతోంది.
Tags:    

Similar News