విద్యా శాఖా ‘‘పంచాయితీ’ శాఖా?

Update: 2016-08-05 06:03 GMT
ఏపీలో మానవ వనరుల శాఖలో వివాదాలు తారస్థాయికి చేరుతున్నాయి. మానవ వనరుల శాఖ పేరుతో నిర్వహిస్తున్న విద్యాశాఖలో నిత్యం రగులుతున్న ఈ పంచాయితీల కారణంగా ఇది విద్యాశాఖా లేదంటే  పంచాయితీల శాఖా అన్న విమర్శలు ఎదుర్కొంటోంది. ఆ శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు.. అందులోని వివిధ విభాగాల అధికారులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. పాఠశాల విద్యాశాఖలో ఎస్‌ సిఇఆర్‌ టి - పరీక్షల బోర్డు - పుస్తక ప్రచురణ విభాగం - ఇంటర్మీడియట్ బోర్డు అధికారులతోనూ - ఉన్నత విద్యాశాఖ అధికారులతోనూ - సర్వ శిక్షా అభియాన్ అధికారులతో ప్రతి రోజూ పంచాయితీలు నడుస్తున్నాయి. మంత్రి కార్యాలయ సిబ్బంది ఆగడాలకు తాము బలి కావలసి వస్తోందని సీనియర్ అధికారులు ఆవేదన చెందుతున్నారు.

ఇంతకాలం హైదరాబాద్ నుండి ఈ కార్యాలయాలు పనిచేయడం - అపుడపుడు మాత్రమే మంత్రి హైదరాబాద్‌ కు వచ్చి సమీక్షలు నిర్వహించడంతో తప్పించుకు తిరిగిన అధికారులు తాజాగా అన్ని కార్యాలయాలను విజయవాడకు తరలించడంతో ఇక అనునిత్యం మంత్రి సిబ్బందితో ఘర్షణ తప్పేలా లేదని అంటున్నారు. మంత్రి కార్యాలయ సిబ్బంది వ్యవహార శైలితోనే ఎసిబి అధికారుల దాడిలో ఎస్‌ సిఇఆర్‌ టి అధికారి ప్రసన్నకుమార్ దొరికిపోయారని పాఠశాల విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. డిఇడి కాలేజీల అనుమతి విషయంలో మంత్రి కార్యాలయ చేతివాటం బహిరంగ రహస్యమేనని ఒక దశలో సిబ్బంది అడిగినంత ఇచ్చుకోకపోవడం వల్లనే కాలేజీలకు, రేటిఫికేషన్లకు అనుమతి లభించలేదని, చివరికి బేరాలు కుదరగానే వ్యవహారం బయటకు వస్తోందని భావించిన సిబ్బంది ఎసిబికి సమాచారం ఇచ్చి ఒక సీనియర్ అధికారిని బలి చేశారని ఆరోపిస్తున్నారు.

ఇంటర్మీడియట్ విద్య బోర్డు పాలనలోనూ మంత్రి సిబ్బంది ప్రమేయం మితిమీరిందని అంటున్నారు. సర్వ శిక్షా అభియాన్‌ కు సంచాలకుడిగా వచ్చిన శ్రీనివాస్ అనే అధికారి ఉత్సాహంగా రాష్ట్రం అంతా పర్యటించి వివిధ జిల్లాల్లో ప్రాజెక్టు అధికారులపై చర్యలకు సిఫార్సు చేయగా - అక్కడ కూడా మంత్రి కార్యాలయ సిబ్బంది తమదైన శైలిలో చక్రం తిప్పుతున్నారని తెలిసింది. పలువురు పిఓలపై చర్యలకు అధికారులు సిఫార్సు చేస్తున్నా అవి కాస్తా మంత్రి కార్యాలయానికి చేరుకుని చిక్కుకుంటున్నాయని, ముందుకు సాగడం లేదని తెలిసింది. అలాగే బదిలీలు - పరిపాలనా వ్యవహారాల్లో రాజ్యాంగేతర శక్తులుగా మంత్రి సిబ్బంది వ్యవహరించడంపై అధికారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా గురువారంతో ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన విద్యా శాఖ విభాగాలు అన్నీ విజయవాడకు తరలివెళ్లాయి. దీంతో ఈ వివాదాలు మరింత ముదురుతాయని భావిస్తున్నారు.
Tags:    

Similar News