ఆ మంత్రి చంద్ర‌బాబు పెంచిన మొక్క‌ట‌

Update: 2016-05-07 10:28 GMT
ఏపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు త‌న శీలాన్ని నిరూపించుకునేందుకు తంటాలు ప‌డుతున్నట్లుగా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల ఆయ‌న చిరంజీవిని పైకి లేపేందుకు తెర‌వెనుక ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లుగా చంద్ర‌బాబు అనుమానించార‌ని... గంటాకు ముకుతాడు వేశార‌ని, ఆయ‌న‌పై ఓ క‌న్నేసి ఉంచార‌ని వార్తలొస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆక్ర‌మంలో గంటా ఇప్పుడు తాను చంద్రబాబు మ‌నిషిన‌ని... సొంతంగా ఎదిగి కాపుల‌కు నాయ‌క‌త్వం వ‌హించాల‌నో.. లేదంటే ఇంకెవ‌రినో పైకి లేపుదామ‌నో ప్ర‌యత్నించ‌డం లేద‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. తాజాగా ఓ ఇంట‌ర్య్వ్యూలో మాట్లాడిన ఆయ‌న తాను చంద్ర‌బాబు పెంచిన మొక్క‌న‌ని భారీ డైలాగు కొట్టారు.

అంతేకాదు.. కాపులు టీడీపీకి దూరం కావాల్సిన ప‌రిస్థితులు లేవ‌ని.. చంద్రబాబు చేసిన‌ట్లుగా కాపుల‌కు ఎవరూ మేలు చేయ‌లేద‌ని చెప్పుకొచ్చారు. కాపుల‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇచ్చింది.. కార్పొరేష‌న్ ఏర్పాటు చేసింది చంద్ర‌బాబేన‌ని ఆకాశానికెత్తేశారు. తానేమీ కాపుల‌కు నాయ‌కుడిని కావాల‌ని కోరుకోవ‌డం లేద‌ని చెప్పిన ఆయ‌న త‌న కుటుంబం, త‌న చుట్టూ ఉన్న‌వారి గురించి కూడా చెప్పొకొచ్చి త‌న స‌చ్ఛీల‌త నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేశారు. తన భార్య కాపు కాద‌ని... త‌న వ్యాపార భాగ‌స్వామి కాపు కాద‌ని, త‌న స్నేహితుల్లో చాలామంది కాపులు కార‌ని గంటా చెప్పారు.

అయితే, టీడీపీ నుంచి ప్రజారాజ్యం.. మ‌ళ్లీ అక్క‌డి నుంచి కాంగ్రెస్ లోకి వ‌చ్చి ప‌ద‌వులు అనుభ‌విస్తున్న గంటా మాట‌లు న‌మ్మ‌రాద‌ని కొంద‌రు అంటున్నారు. భ‌విష్య‌త్తులోనూ గంటా ఈ మాట చెబుతారో లేదో చూడాలంటున్నారు.
Tags:    

Similar News