ఆ సీటు విష‌యంలో కొండా.. రేవంత్ మ‌ధ్య గ్యాప్‌!

Update: 2021-10-11 08:15 GMT
తెలంగాణ రాజ‌కీయాలన్నీ ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయి. అక్టోబ‌ర్ 30న జ‌రిగే పోలింగ్‌లో అత్య‌ధిక ఓట్లు సాధించి విజ‌యం ద‌క్కించుకోవాల‌ని ప్ర‌ధాన పార్టీలు శాయాశ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నాయి. అయితే ఇక్క‌డ ప్ర‌ధాన పోటీ అధికార టీఆర్ఎస్ బీజేపీ మ‌ధ్య మాత్ర‌మేన‌న్న సంగ‌తి తెలిసిందే. భూక‌బ్జా ఆరోప‌ణ‌ల‌తో టీఆర్ఎస్‌ను వీడి ఎమ్మెల్యే ప‌దవికి రాజీనామా చేసి కాషాయం కండువా క‌ప్పుకున్న ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీ త‌ర‌పున బ‌రిలో దిగుతున్నాడు. మ‌రోవైపు ఈట‌ల‌ను ఎలాగైనా ఓడించాల‌ని టీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఈ రెండు పార్టీల మ‌ధ్య‌లో ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేరి మెరుగైన ఫలితాలు సాధించేందుకు సిద్ధ‌మైంది.  విద్యార్థి నేత బ‌ల్మూరి వెంక‌ట్‌ను త‌మ అభ్య‌ర్థిగా ఎంపిక చేసి నామినేష‌న్ వేయించింది.

టీఆర్ఎస్ బీజేపీ మ‌ధ్య ప్ర‌ధాన పోటీ ఉన్న నేప‌థ్యంలో హుజూరాబాద్‌లో కాంగ్రెస్ కూడా పేరున్న నేత‌నే బ‌రిలో దింపుతుంద‌ని మొదట ప్ర‌చారం సాగింది. అందుకు అనుగుణంగానే మాజీ మంత్రి వ‌రంగ‌ల్ నేత కొండా సురేఖ‌ను ఈ ఉప ఎన్నిక‌లో పార్టీ త‌ర‌పున పోటీ చేసేలా ఒప్పించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్ర‌య‌త్నించార‌నే వార్త‌లు వ‌చ్చాయి. కానీ పార్టీలో సీనియ‌ర్ నాయ‌కులు స్థానికుల‌కే అవ‌కాశం ఇద్దామ‌ని ప్ర‌తిపాదించ‌డంతో రేవంత్ వెన‌క్కి త‌గ్గాల్సి వ‌చ్చింద‌నే విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. కానీ కొండా సురేఖ హుజూరాబాద్‌లో పోటీ చేయ‌క‌పోవ‌డం వెన‌క మ‌రో కార‌ణం ఉన్న‌ట్లు తాజాగా అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

హుజూరాబాద్‌లో కాంగ్రెస్ త‌ర‌పున బ‌ల‌మైన నేత పోటీ చేయాల‌ని భావించిన రేవంత్‌.. అందుకు సురేఖ‌ను ఎంచుకున్నారు. ఆమె పోటీ చేస్తే ఆ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీకి మంచి ఊపు వ‌స్తుంద‌ని కాంగ్రెస్ శ్రేణులూ భావించాయి. రేవంత్ రెడ్డితో ఉన్న స‌న్నిహిత సంబంధాల నేప‌థ్యంలో సురేఖ కూడా పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌యార‌ని కానీ అందుకోసం కొన్ని ష‌ర‌తులు విధించార‌ని తెలిసింది. అందులో ఒక దానికి రేవంత్ అంగీక‌రించ‌క‌పోవ‌డంతోనే సురేఖ వెన‌క్కిత‌గ్గార‌నే ప్ర‌చారం సాగుతోంది.  ఓ సీటు విష‌యంలో కొండా సురేఖ దంప‌తులు రేవంత్ మ‌ధ్య వ‌చ్చిన భేదాభిప్రాయాల కార‌ణంగానే ఆమె  హుజూరాబాద్‌లో పోటీకి ఒప్పుకోలేద‌ని చ‌ర్చ న‌డుస్తోంది.

వ‌చ్చే రాష్ట్ర శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని భూపాల్‌ప‌ల్లి ప‌రకాల వ‌రంగ‌ల్ స్థానాల‌ను త‌మ‌కు కానీ లేదా తాము సూచించిన వ్య‌క్తుల‌కు కానీ ఇవ్వాల‌ని కొండా దంప‌తులు ప‌ట్టుబ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం భూపాల్‌ప‌ల్లి విష‌యంలో విభేదించార‌ని స‌మాచారం. కొండా దంప‌తుల‌కు ఇష్టం లేక‌పోయినా గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌ను రేవంత్ పార్టీలోకి తీసుకొచ్చార‌ని టాక్‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున ఆయ‌న‌కే భూపాల్‌ప‌ల్లి టికెట్ ఇవ్వాల‌ని రేవంత్ అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే కొండా దంప‌తులు అడిగిన‌దానికి రేవంత్ ఒప్పుకోలేద‌ని స‌మాచారం. దీంతో హుజూరాబాద్‌లో పోటీ చేయాల‌నే రేవంత్ ప్ర‌తిపాద‌న‌ను సురేఖ తిర‌స్క‌రించిన‌ట్లు టాక్‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ క‌చ్చితంగా గెలిచే అవ‌కాశం ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ ఇప్ప‌టి నుంచే దృష్టి పెట్టార‌ని అందుకే అలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని బ‌లోపేతం చేసేందుకు చేరిక‌ల‌పై ఫోక‌స్ పెట్టార‌నే చ‌ర్చ సాగుతోంది. అందుకే భూపాల్‌ప‌ల్లి విష‌యంలో కొండా దంప‌తుల డిమాండ్‌ను రేవంత్‌ను ప‌క్క‌న‌పెట్టార‌ని అంటున్నారు. మ‌రి ఈ సీటు విష‌యంలో వీళ్ల మ‌ధ్య వ‌చ్చిన గ్యాప్ ఎలా త‌గ్గుతుందోన‌ని కాంగ్రెస్ శ్రేణులు చూస్తున్నాయి.
Tags:    

Similar News