ఆ పెళ్లిళ్లకు అమెరికన్లు ‘డబుల్’ ఓకే

Update: 2016-05-21 04:05 GMT
మగ.. ఆడ పెళ్లి చేసుకోవటం నాటి మాట. మగాడ్ని మరో మగాడు.. అదే తీరులో అమ్మాయిని మరో అమ్మాయి పెళ్లి చేసుకోవటం ఈ మధ్యన పెరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి విషయాలు వినేందుకు ఇష్టం లేని పరిస్థితి నుంచి.. బాలీవుడ్ సినిమాల్లో పాత్రల రూపంలో మన నట్టింట్లోకి వచ్చేసిన పరిస్థితి. ఈ తరహా ఉదంతాల్ని విని.. ‘‘ప్రకృతి ధర్మానికి భిన్నంగానా..’’ అంటూ సాగదీసే రోజులు పోయి చాలా కాలమే అయ్యింది. ఆహా.. అలాగానా? అనుకోవటం.. బాగా దగ్గరి వాళ్లైతే మరికాస్త ఆసక్తికరంగా చర్చించుకోవటం మినహాయించి.. దాన్నో నేరంగా చిత్రీకరించి చిందులేసే వారి సంఖ్య  కాస్త తగ్గినట్లే.

మన దగ్గరే మార్పు ఈ రేంజ్ లో ఉంటే.. ఇలాంటి సంస్కృతులకు పుట్టిల్లు లాంటి అమెరికాలో మరెంత ఎక్కువగా ఉంటాయన్న విషయం మీద తాజాగా స్పష్టత వచ్చేసింది. స్వలింగ సంపర్కులు పెళ్లిళ్లకు అమెరికా సమాజం ఎంతగా ఆమోదిస్తుంది? అన్న అంశం మీద  ఒక కంపెనీ తాజాగా సర్వే నిర్వహించింది. దీని ఫలితాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.  గేల పెళ్లిళ్లకు మద్దతు ఇవ్వొచ్చా? అలాంటి పెళ్లిళ్లకు చట్టపరమైన గుర్తింపు మాటేమిటి? అన్న అంశాలపై గాలప్ అనే కంపెనీ ఒకటి సర్వే చేపట్టింది. ఇలాంటి సర్వేను ఇరవై ఏళ్ల క్రితం 1996లో నిర్వహించగా.. కేవలం 27 శాతం మంది మాత్రమే ఓకే అంటే.. తాజా సర్వేలో మాత్రం ఇలాంటి వాటికి ఏకంగా 61 శాతం ఓకే అనటం గమనార్హం.

స్వలింగ వివాహాలకు ఓకే చెప్పే వారి శాతం డబుల్ కావటమే కాదు.. వయసుల వారీగా కూడా ఇలాంటి వాటిని ఒప్పుకునే విషయంలో మార్పు స్పష్టంగా కనిపించటం గమనార్హం. తాజాగా చేపట్టిన సర్వేలో 30 ఏళ్ల లోపు వారంతా ఇలాంటి పెళ్లిళ్లకు ఓకే చెప్పేశారట. సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లకు పైబడిన వారు కూడా) ఓకే అంటున్నారట. అయితే.. ఇలాంటివాటికి చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వాలన్న సూచన చేయటం గమనార్హం. అంటే.. రానున్నరోజుల్లో గే పెళ్లిళ్లు మాజోరుగా జరుగుతాయన్న మాట.
Tags:    

Similar News