త‌లసానికి ఇప్పుడు టైం వ‌చ్చింది

Update: 2015-12-10 06:38 GMT
త‌ల‌సాని శ్రీ‌నివాస్‌ యాద‌వ్...తెలంగాణ‌లోనే కాదు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో కూడా ఈ పేరు పాపుల‌ర్. ఎన్నిక‌ల ముందు టీడీపీలో ఉండి కేసీఆర్‌ ను  విమ‌ర్శించి.. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన అనంత‌రం గులాబీ కండువా క‌ప్పుకొని కేసీఆర్‌ ను పొగ‌డ్త‌ల్లో ముంచెత్తుతున్నారు. త‌ల‌సానిపై ఉన్న న‌మ్మ‌కంతో ఆయ‌నకు మంత్రి ప‌దవి ఇచ్చిన కేసీఆర్ ఆయ‌న బాధ్య‌త నిర్వ‌హ‌ణ ప‌ట్ల ఒకింత సంతృప్తిగానే ఉన్నారు. అయితే ఇపుడు అదే మంచిపేరు త‌ల‌సానికి స‌వాల్‌ గా మారే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

తలసానితో పాటు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో ముగ్గురు మంత్రులు మహమూద్ అలీ - నాయిని నర్సింహరెడ్డి - పద్మారావు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థ‌వంతంగా తీసుకువెళ్లలేకపోతున్నార‌ని టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లే చెప్తుంటారు. మంత్రి పద్మారావు కేవలం తన నియోజకవర్గానికి మాత్రమే మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని గులాబీ శ్రేణులంటున్నాయి. విపక్షాల నుంచి ఎన్ని విమర్శలు ఎదురైన మైనార్టీ వర్గానికి చెందిన ఒక క్రీడాకారిణికి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు కోట్ల రూపాయల నగదు నజరాన ప్రకటించారు. మైనార్టీ వర్గానికి చెందిన పేద ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సహాయం కోసం  షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకాలన్నీ మైనార్టీ వర్గాలను ఎంత వరకు పార్టీ వైపు ఆకర్షించాయన్నది సందేహాస్ప‌ద‌మే. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజ‌యానికి మైనార్టీల ఓట్లే కీలకం అయిన‌ప్ప‌టికీ...మైనార్టీ ఓటర్లను ఆకర్షించడంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ పనితీరుకు అంత‌బాగా లేద‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు చెప్తున్నాయి. హోంమంత్రి నాయిని నర్సిం హ్మరెడ్డి ఆరోగ్య కారణాలరీత్యా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనలేకపోతున్నారు.

ఇక త‌ల‌సాని విష‌యానికి వ‌స్తే...తలసాని చేరికతో తరువాత గ్రేటర్‌ లో టీఆర్ ఎస్ పుంజుకున్నదన్నది నిజం. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన రాక‌తో పలవురు ఎమ్మెల్యేలు - వందలాది మంది ద్వితీయ శ్రేణి నాయకులు కారెక్కిన విషయం తెలిసిందే. కేవలం తెలుగుదేశం పార్టీ నుంచే, కాకుండా ఇతర పార్టీలోని తన సన్నిహితులు టీఆర్ ఎస్‌ లో చేరడంలో మంత్రి కీలకపాత్ర పోషించారు. మ‌రోవైపు ప్రభుత్వ పనితీరుపై విపక్షాల విమర్శలను, ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ, ముఖ్యమంత్రి ఎంతో నమ్మకంతో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ వస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం త‌ల‌సానికే గ్రేట‌ర్ ఎన్నిక‌ల బాధ్య‌త‌లు అప్ప‌గించే దిశ‌గా క‌స‌ర‌త్తు సాగుతోంది. అయితే ఇప్పటి వరకు పార్టీ బలోపేతానికి కృషి చేయడం ఒక ఎత్తయితే, త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే గ్రేట‌ర్‌ ఎన్నికల్లో పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థులను ముందుండి గెలిపించడం త‌ల‌సాని ముందున్న అస‌లు స‌వాల్‌. గ్రేటర్ పరిధిలో ఎంత గొప్పగా చెప్పుకున్న టీఆర్ ఎస్ బలం అంతంతా మాత్రమే. దీనికితోడు సెటిలర్లు టీఆర్ ఎస్‌ ను ఆదరించడానికి మరికొంత సమయం పట్టడం ఖాయం. ఈ పరిస్థితుల్లో మెజార్టీ స్థానాల్లో టీఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించడం తలసానికి సవాల్ కానంది. త‌ద్వారా గ్రేట‌ర్ పోరు త‌ల‌సానికి గ్రేట్ టెస్ట్ కానుంది.
Tags:    

Similar News