స‌చివాల‌యాల‌పై ఇంత అక్క‌సా? అన్నా రాంబాబుపై వైసీపీ ఫైర్‌!

Update: 2020-10-03 10:10 GMT
రాజ‌కీయాల్లో దూకుడు ఉండాలి. కానీ, ఆ దూకుడు.. సొంతింటికి సున్నం కొట్టేలా ఉండ‌కూడ‌దు అంటారు రాజ‌కీయ పండితులు. అయితే, అదేం శాప‌మో తెలియ‌దు.. ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు ఎమ్మెల్యే - ప్ర‌స్తుత వైసీపీ నాయ‌కుడు అన్నా రాంబాబు మాత్రం తిన్నింటి వాసాలే లెక్క‌పెడుతూ ఉంటార‌ని స్థానికంగా టాక్ వినిపిస్తూ ఉంటుంది. ఆయ‌న ఇప్ప‌టికి మూడు పార్టీలు మారారు. ఏ ఒక్క పార్టీలో కూడా అంకిత భావంతో ప‌నిచేసింది లేదు అని అంటుంటారు. ఎంత‌సేపూ.. కోడిగుడ్డుపై ఈక‌లు పీకే త‌త్వంతో ముందుకు సాగుతార‌నే విమ‌ర్శలు ఉన్నాయి. గ‌తంలో టీడీపీ.. త‌ర్వాత ప్ర‌జారాజ్యం.. మ‌ళ్లీ టీడీపీ.. ఇప్పుడు వైసీపీ!

వాస్త‌వానికి నాయ‌కుడు అంటే.. ఏ పార్టీలో ఉంటే..ఆపార్టీ అనే మొక్క‌కు నీళ్లు పోసేలా ఉండాలి. కానీ, అన్నా వారు.. మాత్రం ఇష్టారాజ్యంగా చెలిరేగిపోతుంటారు అని అంటూ ఉంటారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచం మొత్తం కీర్తిస్తున్న గ్రామ‌ - వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ - వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను అన్నావారు.. ఒకే ఒక్క మాట‌తో తీసి ప‌క్క‌న ప‌డేసినంత ప‌నిచేశారు. రాష్ట్రంలో వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ ఉన్న‌ప్ప‌టికీ.. స‌మ‌స్య‌లు ఎక్క‌డివి అక్క‌డే ఉన్నాయంటూ.. ఆయ‌న మా గొప్ప‌గా చెప్పుకొచ్చారు అట! ఇదే నిజ‌మైతే.. రాష్ట్రంలో ఒక‌టో తేదీ వ‌చ్చేనాటికి.. వృద్ధులు - విక‌లాంగులు పింఛ‌న్ల కోసం.. ఆఫీసుల వ‌ద్ద క్యూ క‌ట్టాలి క‌దా? అది  లేదేం?

ప్ర‌భుత్వ ప‌థ‌కాల కోసం.. ప్ర‌జ‌లు ఎమ్మార్వో కార్యాల‌యాల చుట్టూ తిర‌గాలి క‌దా.. అలా కూడా ఎక్క‌డా వార్త‌లు రావ‌డం లేదే. మ‌రీ ముఖ్యంగా ప్ర‌జ‌ల‌కు ఏ ప‌థ‌కం కావాల‌న్నా.. ప్ర‌భుత్వం నుంచి ఎలా సాయం పొందాల‌న్నా.. వెంట‌నే వ‌లంటీర్‌ ను సంప్ర‌దిస్తున్న విష‌యం అన్నావారికి అర్ధ‌మై ఉండ‌దు. రాష్ట్రంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌ల‌వుతున్న గ్రామ‌ - వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌.. ప్ర‌భుత్వానికి-ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య వార‌ధిగా నిలిచింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చిన జ‌గ‌న్‌ కు ఇంటా బ‌య‌టా కూడా ప్ర‌శంస‌లు కురుస్తూనే ఉన్నాయి. గ‌త ఏడాది వైసీపీ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అమ‌ల్లోకి వ‌చ్చిన ఈ వ్య‌వ‌స్థ‌.. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న‌ను నిజం చేసింది!

అంతేకాదు.. ఇదొక వినూత్న ఆలోచ‌న‌. దాదాపు 4 ల‌క్ష‌ల మంది వ‌లంటీర్ల‌ను ఏర్పాటు చేసుకుని, గ్రామ‌ - ప‌ట్ట‌ణ స్థాయిలో స‌చివాల‌యాల‌ను తీసుకువ‌చ్చి.. ప్ర‌జ‌ల‌కు పాల‌న‌ను చేరువ చేయ‌డం అంటే.. ఆషామాషీకాదు. ఈ వ్య‌వ‌స్థ అన్నివేళ‌ల్లోనూ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంద‌న‌డానికి నిద‌ర్శ‌నం.. ఏప్రిల్‌ - మే  - జూన్‌ - జూలై నెల‌ల్లో రాష్ట్రంలో క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాలేని పరిస్థితిలో వారి ఇంటికే నిత్య‌వ‌స‌రాల‌ను అందించ‌డం - మందులు - మాస్కులు చేరువ చేయ‌డం - ప్ర‌జ‌ల ఆరోగ్య ప‌రిస్తితిని అంచ‌నా వేయ‌డం.. ఇలా ఒక‌టేంటి.. వంద‌ల్లో సేవ‌లు అందించార‌న‌డంలో సందేహం లేదు. పైగా జ‌గ‌న్ ఆలోచ‌న‌ను.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సైతం ప్ర‌స్తుతించారు.  

ఐఏఎస్ ట్రైనింగ్‌లో కూడా వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ఒక పాఠ్యాంశంగా చేర్చార‌ని తెలుస్తోంది. ఇక‌, గ‌తంలో చంద్ర‌బాబుకు వంత పాడిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం జ‌గ‌న్ ప్ర‌వేశ పెట్టిన వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను మెచ్చుకున్నారు. కేర‌ళ - పుదుచ్చేరి - ఒడిసా ప్ర‌భుత్వాలు కూడా వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌పై అధ్య‌య‌నం చేసి వెళ్లాయి.  అయితే.. ఏ వ్య‌వ‌స్థ‌లో అయినా.. ఒక‌రిద్ద‌రు సోమ‌రులు ఉన్న‌ట్టుగానే ఈ వ్య‌వ‌స్థ‌లోనూ ఒక‌రిద్ద‌రు వ‌లంటీర్లు త‌ప్పులు చేసి ఉండొచ్చు. రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు కూడా లొంగి ఉండొచ్చు. అంత మాత్రాన అన్నా రాంబాబు.. మొత్తం వ్య‌వ‌స్థ‌పైనే బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం చేయ‌డం.. సొంత ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలోకి నెట్ట‌డం స‌బ‌బు కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే విష‌యంపై వైసీపీ నాయ‌కులు మ‌రింత ఫైర్ అవుతున్నారు.
Tags:    

Similar News