కార్పొరేట్ స్కూళ్లా?కంప‌రానికి కేరాఫ్ అడ్రెస్‌ లా?

Update: 2017-09-11 07:47 GMT
కార్పొరేట్ ఆఫీస్‌ ను త‌ల‌ద‌న్నే భ‌వ‌నం... నోరు తెరిస్తే ఇంగ్లీష్ మాట్లాడే టీచ‌ర్లు... విశాల‌మైన ప్లే గ్రౌండ్‌... న‌యా రంగుల్లో క‌నిపించే స్కూల్ డ్రెస్‌... కాలికి మ‌ట్టి అంట‌ని ఫ్లోరింగులు... చెమ‌ట చుక్క రాని రీతిలో నిత్యం ప‌నిచేసే ఏసీ మెషీన్లు... బోర్డు స్థానంలో డిజిట‌ల్ పాఠాలు చెప్పే ఎల్ ఈడీ స్క్రీన్లు... ఇవీ ఇప్పుడు మ‌న‌మంతా చెప్పుకునే కార్పొరేట్ స్కూళ్ల తీరు. అంతేకాదండోయ్‌... ఈ స్కూళ్ల‌లో ప‌నిచేసే ఉపాధ్యాయుల‌తో పాటు యాజ‌మాన్యం కూడా కార్పొరేట్ త‌ర‌హాలోనే వ్య‌వ‌హ‌రిస్తార‌నుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. ఎందుకంటే... ఈ స్కూళ్లలో కొన్నింటి యాజ‌మాన్యాల‌తో పాటు కొంద‌రు టీచ‌ర్లు కూడా కంపు ప‌నులు చేస్తూ యావ‌త్తు విద్యా వ్య‌వస్థ‌కే చెడ్డ పేరు తెస్తున్నారు.

నిజ‌మే... ఓ నాలుగైదేళ్ల క్రితం హైద‌రాబాదు శివారు శివరాంప‌ల్లి ప‌రిధిలోని ఓ కార్పొరేట్ స్కూల్ య‌జ‌మాని త‌న స్కూల్‌ లో విద్య‌న‌భ్యసించేందుకు వ‌చ్చిన ఓ బాలిక‌ను చెరబ‌ట్టేశాడు. పాఠ‌శాల య‌జ‌మానిని అన్న ఇంగిత జ్ఞానాన్ని మ‌రిచి ఆ బాలిక జీవితాన్ని స‌ర్వ‌నాశ‌నం చేసేశాడు. ఇప్పుడు స‌ద‌రు కార్పొరేట్ స్కూల్‌ కు ఏమాత్రం తీసిపోన‌ని ఆ స్కూల్‌ కు అతి స‌మీపంలోనే ఉన్న మ‌రో కార్పొరేట్ స్కూల్ త‌న నీచాన్ని చాటుకుంది. ఇక అస‌లు విష‌యంలోకి వెళితే... హైద‌రాబాదు శివారు ప్రాంతం బీహెచ్ ఈఎల్ ప‌రిధిలోని ఓ కార్పొరేట్ పాఠ‌శాల‌లో ఓ దారుణాతి దారుణం చోటుచేసుకుంది. పాఠ‌శాల నియ‌మాన్ని పాటించలేద‌న్న చిన్న సాకును చూపి ఓ బాలిక‌ను బాలురు వినియోగించే మ‌రుగుదొడ్డిలో నిలుచోబెట్టి వింత శిక్ష విధించింది. ఈ షాకింగ్ శిక్షకు త‌ట్టుకోలేని స‌ద‌రు చిన్నారి స్పృహ త‌ప్పి ప‌డిపోగా... ఇప్పుడు ఈ విష‌యంపై దేశ‌వ్యాప్తంగా ఆగ్ర‌హావేశాలు వెల్లువెత్తుతున్నాయి.

స‌ద‌రు పాఠ‌శాల‌లో ఏడో త‌ర‌గతి చ‌దువుతున్న ఓ చిన్నారి... స్కూల్ డ్రెస్ వేసుకోకుండా పాఠ‌శాల‌కు వ‌చ్చింద‌ట‌. ఇదేంటని ప్ర‌శ్నిస్తే... త‌న త‌ల్లి స్కూల్ డ్రెస్‌ ను ఉతికింద‌ని, ఈ కార‌ణంగానే తాను మామూలు డ్రెస్‌ లో వ‌చ్చాన‌ని తెలిపింద‌ట‌. అయితే బాలిక స‌మాధానంతో శాంతించాల్సిన క్లాస్ టీచ‌ర్‌... బాలిక‌కు ఇప్ప‌టిదాకా ఏ ఒక్క‌రూ వేయ‌ని శిక్ష‌ను వేసేందుకు సిద్ధ‌మైపోయింది. త‌న నోటి నుంచి వ‌చ్చిన ఆదేశాల‌తో ఆ బాలిక షాక్ తిన్నా... విన‌ని స‌ద‌రు క్లాస్ టీచ‌ర్‌... బాలిక‌ను బాయిస్ టాయిలెట్‌ లో నిలుచోబెట్టింద‌ట‌. దీంతో బాలిక స్పృహ త‌ప్పి ప‌డిపోగా... ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్కేసింది. ఇప్పుడు ఈ విష‌యంపై అన్ని మీడియా సంస్థ‌లు పెద్ద ఎత్తున క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తున్నాయి.

ఫ‌లితంగా స‌ద‌రు పాఠ‌శాల వ్య‌వ‌హ‌రించిన సిగ్గుమాలిన చ‌ర్య‌పై దేశవ్యాప్తంగా ఆందోళ‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. విష‌యం తెలుసుకున్న వెంట‌నే రంగంలోకి దిగిన మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు... ఘ‌ట‌న‌పై పూర్తి స్థాయిలో ద‌ర్యాప్తు జ‌రిపి నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేశారు. కేటీఆర్ ఆదేశాల్లో రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం - విద్యాశాఖ మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి దీనిపై ద‌ర్యాప్తున‌కు ఆదేశాలు జారీ చేశారు. ఏది ఏమైనా ఈ త‌ర‌హా కొత్త ర‌కం శిక్ష‌లు విధిస్తున్న స్కూళ్లు - ఉపాధ్యాయుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌న్న డిమాండ్ వినిపిస్తోంది.
Tags:    

Similar News