ఎన్నారైలకు ఓటుహక్కు..కోర్టు తీపిక‌బురు

Update: 2017-07-16 04:36 GMT
ప్రవాస భారతీయులకు గొప్ప తీపిక‌బురు వినిపించింది. ఎన్నారైల‌కు ఓటుహక్కు కల్పించేందుకు చట్టాన్ని లేదా నిబంధనలను సవరించడంపై వారం రోజుల్లోగా స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు - కేంద్ర ప్ర‌భుత్వ అఫిడ‌విట్ నేప‌థ్యంలో ఎన్నారైల‌కు ఓటు హ‌క్కు క‌ల్పించే దిశ‌గా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చున‌ని స‌మాచారం. ఎన్నారైలు నాగేందర్ నందం - షంషేర్ వీపీ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్ - న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ తో కూడిన ధర్మాసనం ఈ విషయమై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఎన్నారైలకు ఓటు హక్కు కల్పించే విషయమై ఎన్నికల సంఘంతో ఏకాభిప్రాయానికి వచ్చామని, ఎలా అమలు చేయాలన్నదే తేలాల్సి ఉన్నదని పేర్కొంటూ కేంద్రం చేసిన ప్రకటనను పరిగణనలోకి తీసుకున్నట్టు ధర్మాసనం తెలిపింది. ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని లేదా ఆ చట్టం కింద నిబంధనలను సవరించడం ద్వారా ఎన్నారైలకు ఓటుహక్కు కల్పించవచ్చని ధర్మాసనం సూచించింది.

ప్రవాసీయుల ఓటుహక్కు వినియోగానికి గల ప్రత్యామ్నాయాలపై డిప్యూటీ ఎన్నికల కమిషనర్ వినోద్ జుట్షీ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని అదనపు అటార్నీ జనరల్ పింకీ ఆనంద్ కోర్టుకు తెలిపారు. ఇందుకోసం నిబంధనలను సవరిస్తే సరిపోతుందని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. కోర్టు తదుపరి విచారణను 21వ తేదీకి వాయిదా వేసింది.

ఇదిలాఉండ‌గా...ఎన్నారైలకు చట్టం లేదా నిబంధనలను సవరించడం ద్వారా పోస్టల్ ఓటు హక్కు కల్పించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొనటంపై ప్రవాసీభారత్ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ నాగేందర్ చిందం లండన్ నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సానుకూల ఫలితాలు వెలువడడం సంతోషదాయకం అని ఆయన పేర్కొన్నారు. ప్రవాస ఓటింగ్ వ్యవహారాన్ని వేగవంతం చేసినందుకు సర్వోన్నత న్యాయస్థానానికి నాగేందర్ చిందం, రోహిత్ ప్రకాశ్ కృతజ్ఞతలు తెలిపారు.
Tags:    

Similar News