ఎన్ని రోజులు అని కాదు.. ఎంత అవినీతి లేకుండా ఉంటారు?: ఏపీకి ఇండ‌స్ట్రియ‌లిస్టుల షాక్‌

Update: 2023-02-20 21:00 GMT
ఏపీ ప్ర‌భుత్వం వ‌చ్చే మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు మంత్రులు దేశ‌వ్యాప్తంగా తిరుగుతున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో పరిశ్రమల శాఖ రోడ్ షో నిర్వహించింది. మంత్రులు బుగ్గన, గుడివాడ అమర్నాథ్, ఆదిమూలపు సురేష్  త‌దిత‌రులు ఈ రోడ్ షోలో పాల్గొని ప్ర‌చారం చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు పారిశ్రామిక వేత్త‌ల‌తో వారు భేటీ అయ్యారు.

పరిశ్రమల ఏర్పాటుకు భూ లభ్యత, వనరులు, 21 రోజుల్లోనే అనుమతులు తదితర అంశాలను ముంబైలోని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు పరిశ్రమల శాఖ అధికారులు వివరించారు. కాస్మొపాలిటన్ నగరంగా విశాఖలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు వివరించారు. మరోవైపు వివాదాస్పద ప్రశ్నలు సమాధానాలు రాకుండా ప్రభుత్వం మంత్రి ప్రసంగం ముగిసిన వెంటనే ప్రశ్నలు సమాధానాల కార్యక్రమం లైవ్ లింక్ను తొలగించింది. అయితే.. ఈలోపే ఒక పారిశ్రామిక వేత్త సంధించిన ప్ర‌శ్న వెలుగు చూసింది.

``ఎన్ని రోజుల్లో అనుమ‌తులు ఇస్తారు.. అనేది ఇంపార్టెంటే కానీ, అవినీతికి తావులేని అనుమ‌తులు కావాలి`` అని ఒక పారిశ్రామిక వేత్త ఇంగ్లీష్‌లో ప్ర‌శ్నించారు. దీనికి మంత్రులు బుగ్గ‌న‌, గుడివాడ ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా స్పందిస్తూ.. అది కేవ‌లం ప్ర‌తిప‌క్షాల ప్ర‌చారం మాత్ర‌మేన‌ని.. నో సింగిల్ రూపీ.. బ్రైబ్ ఇన్‌ది స్టేట్ అని స‌మాధానం చెప్పారు. అయిన‌ప్ప‌టికీ స‌ద‌రు పారిశ్రామిక వేత్త మాత్రం సంతృప్తి చెంద‌లేదు. ఇక‌, ఇంత‌లోనే లైవ్ క‌ట్ చేశారు.

ఇక‌, మంత్రులు ఏమ‌న్నారంటే..

ఐటీ తరహాలో ఆహార శుద్ధి పరిశ్రమల్లోనూ ప్లగ్ అండ్ ప్లే విధానాన్ని అమలు చేయాలని ఏపీ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి గుడివాడ‌ తెలిపారు. ఏపీలో కొత్తగా 26 పరిశ్రమలకు ఈ తరహాలో ప్లగ్ అండ్ ప్లే విధానం అమలు చేయనున్నట్టు వెల్లడించారు. 15 ఏళ్లకు లీజు విధానంలో పరిశ్రమలు ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకేచోట పరిశ్రమల్ని గుమ్మరించారని ఏపీ  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.  విభజన తర్వాత ఏపీ పారిశ్రామికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు.

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో అందుకే పోర్టులు, రహదారులు, రైల్ నెట్వర్క్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి నగరాలకు చుట్టుపక్కలే ఏపీలోని నగరాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. వాటికి ఆనుకునే పరిశ్రమలకు కేటాయించేలా భూములు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ నగరాలకు అనుసంధానమైన పోర్టుల ద్వారా తూర్పు ఆసియా దేశాలతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News