టీమ్ ఇండియాకు గంభీర్ స్థానంలో కొత్త కోచ్.. మన హైదరాబాదీనే..
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇటీవలి కాలంలో తీసుకున్న అత్యంత కీలక నిర్ణయం..
ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడం చూశాం కానీ.. కోచ్ లకు కూడా విశ్రాంతినివ్వడం ఇటీవలి కాలంలో చూస్తున్నాం.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇటీవలి కాలంలో తీసుకున్న అత్యంత కీలక నిర్ణయం.. మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ను టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా నియమించడం.. కేవలం 43 ఏళ్ల వయసులోనే భారత్ వంటి జట్టుకు హెడ్ కోచ్ కావడం అంటే మాటలు కాదు.. రిటైరైన ఏడెనిమిదేళ్లలోపే ఇంత బాధ్యతలు దక్కాయంటే గంభీర్ లో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. అంతేకాదు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్ కతా నైట్ రైడర్స్ వంటి సాధారణ జట్టును రెండు సార్లు చాంపియన్ గా నిలపడం, మెంటార్ గా బాధ్యతలు చేపట్టిన ఏడాదే మరోసారి చాంపియన్ గా నిలిచేలా చూడడంతో గంభీర్ విశిష్టతలను తెలియజేస్తోంది.
27 ఏళ్ల తరవాత వన్డే సిరీస్.. తొలిసారి టెస్టు సిరీస్
గంభీర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టి మూడు నెలలైంది. అయితే, ఇంతలోనే అతడిపై విమర్శలు వస్తున్నాయి. అతడు కోచ్ గా వ్యవహరించిన తొలి వన్డే సిరీస్ లోనే (శ్రీలంక) టీమ్ ఇండియా పరాజయం పాలైంది. 27 ఏళ్ల తర్వాత శ్రీలంకకు వన్డే సిరీస్ ను కోల్పోయింది. అంతేకాదు.. తాజాగా చరిత్రలో తొలిసారి స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ ఓటమి ఎదుర్కొంది. దీంతోనే గంభీర్ కోచింగ్ స్టయిల్ ప్రశ్నలకు తావిస్తోంది.
వచ్చే సిరీస్ నుంచి..
ప్రస్తుతం న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ అనంతరం టీమ్ ఇండియా.. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ వచ్చే నెల 8 నుంచి 15 వరకు 4 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఆడనుంది. దీనికోసం బీసీసీఐ జట్టును కూడా ప్రకటించింది. అయితే, ఈ సిరీస్ కు కోచ్ గా గంభీర్ వెళ్లడం లేదు. ఆశ్చర్యకరంగా టి20 జట్టు కోచింగ్ బాధ్యతలను హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ చూడనున్నాడు. గతంలో తాత్కాలిక కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించిన లక్ష్మణ్ నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్‌గా ఉన్నాడు. గంభీర్ కంటే ముందే లక్ష్మణ్ పేరు హెడ్ కోచ్ గా వినిపించింది. మెరుగైన చాయిస్ అయినప్పటికీ.. ఎందుకనో అతడు బాధ్యతలు చేపట్టలేదు.
ఈ సిరీస్ కోసమే
వచ్చే నెల 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. దీని కోసం మన జట్టు నవంబరు 10న బయలుదేరనుంది. దీంతోనే గంభీర్ ను దక్షిణాఫ్రికా వెళ్లే జట్టుతో పంపడం లేదు. దక్షిణాఫ్రికా సిరీస్ నవంబర్ 8 నుంచి మొదలవుతుంది. అంటే.. గంభీర్ అందుబాటులో ఉండడం కష్టం. అందుకే లక్ష్మణ్ ను పంపుతోంది. తాత్కాలిక కోచ్ గా బీసీసీఐ బాధ్యతలు అప్పగించింది. లక్ష్మణ్ కు సహాయక కోచింగ్ సిబ్బందిగా అతడి ఎన్సీఏ సహచరులు సాయిరాజ్ బహుతులే, హృషికేశ్ కనిత్కర్, శుభదీప్ ఘోష్ ఉండనున్నారు.