జగన్ విషయంలో షర్మిలకు కాంగ్రెస్ నుంచి మరో తోడు దొరికింది!

గత కొంతకాలంగా.. ప్రధానంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయినప్పటి నుంచీ వైసీపీ అధినేత జగన్ పై ఒక రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే

Update: 2024-10-28 13:11 GMT

గత కొంతకాలంగా.. ప్రధానంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయినప్పటి నుంచీ వైసీపీ అధినేత జగన్ పై ఒక రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అంశం ఏదైనా, లక్ష్యం మరేదైనా.. "టార్గెట్ జగన్" అనే విషయంలో ఆమె అవిరామంగా దూసుకుపోతున్నారన్ని అంటుంటారు. ఈ నేపథ్యంలో ఆమెకు కాంగ్రెస్ నుంచి మరో వ్యక్తి తోడు దొరికిందనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును... ఏపీలో షర్మిల పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచీ గరిష్టంగా మైకందుకున్న ప్రతీసారీ జగన్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారనే చర్చ బలంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... జగన్ అధికారంలో ఉన్నప్పుడూ అదే తంతు, జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ అదే వ్యవహారం అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

అయితే... ఆమె అంత ఘాటుగా కాకపోయినా.. ఎంతో కొంత జగన్ పై మరో ఏపీ కాంగ్రెస్ నేత చేయడం లేదని అంటుంటారు. కారణం ఏదైనప్పటికీ... పనిగట్టుకుని మైకుల ముందుకో, ఎక్స్ వేదికగానో జగన్ పై విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలు లేరని.. దీంతో ఈ విషయంలో షర్మిల ఒంటరి పోరాటం చేస్తున్నారని చెబుతుంటారు.

ఈ సమయంలో "నేనున్నాను" అన్నట్లుగా మాణికం ఠాగూర్ వచ్చారనే చర్చ మొదలైంది. దీనికి కారణం... తాజాగా వైసీపీ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్. ఆ పోస్ట్ లో సామాన్య ప్రజానికంతో, వారిలో ఒకరిగా రాజశేఖర్ రెడ్డి కలిసి ఉన్నట్లు ఉన్న ఓ ఫోటోను కూడా జత చేసింది వైసీపీ. ఈ సందర్భంగా వైఎస్సార్ గొప్పతనం గురించి చెబుతూ ఓ వాక్యం రాసింది.

ఇందులో భాగంగా... "ప్రజా సమస్యల పరిష్కారానికే మొదట ప్రాధాన్యత ఇచ్చేవారు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. రోజూ ఉదయం ప్రజలను కలిసిన తర్వాతే తన దినచర్య ప్రారంభమయ్యేది" అని రాస్తూ.. #వైఎస్సార్ ఫర్ ఎవర్ అని పోస్ట్ చేసింది. దీంతో.. ఈ ట్వీట్ పై మాణికం ఠాగూర్ స్పందించారు.

ఇందులో భాగంగా... "జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధనవంతుల్ని మాత్రమే కలిసేవారు. కలెక్షన్లతో బిజీగా గడిపేవారు. నిజానికి జగన్ ఎప్పుడూ వైఎస్సార్ ని అనుసరించలేదు లేదా పాటించలేదు" అని రిప్లై ఇచ్చారు ఏపీ కాంగ్రెస్ వ్యవహారల ఇన్ చార్జ్. దీంతో... ఏపీలో జగన్ ని విమర్శించే విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలకు ఓ తోడు దొరికిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

Tags:    

Similar News