కొనేయొచ్చా..?; నేల చూపులు చూస్తున్న పసిడి

Update: 2015-10-01 22:30 GMT
సీజన్ లేకపోవటం.. అంతర్జాతీయ పరస్థితులు సానుకూలంగా లేని నేపథ్యంలో పసిడి ధరలు తగ్గటం మామూలే. శ్రావణమాసం తర్వాత పండుగల సీజన్ మొదలైన తర్వాత పసిడి ధర దూసుకెళ్లటమే తప్పించి తగ్గటం చాలా తక్కువ. ఆగస్టు నెలలో నేల చూపులు చూసిన బంగారం.. ఆ తర్వాత కోలుకొని ధర పెరగటం తెలిసిందే.

అనూహ్యంగా గత ఐదు రోజులుగా బంగారం ధర రోజురోజుకీ పడిపోవటం గమనార్హం. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెద్దగా లేకపోవటం.. కొనుగోళ్లు అనుకున్నంతగా లేకపోవటంతో బంగారం ధర తగ్గుతుందన్న వాదన వినిపిస్తోంది.

తాజాగా గురువారం మార్కెట్ క్లోజ్ అయ్యే నాటికి బుధవారం ముగింపుతో పోలిస్తే.. పది గ్రాములకు రూ.250 తగ్గిన పరిస్థితి. అదే విధంగా వెండి ధర కూడా తగ్గింది. బుధవారం క్లోజింగ్ తో పోలిస్తే.. గురువారం క్లోజింగ్ నాటికి కేజీకి రూ.150 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం గురువారం క్లోజింగ్ నాటికి రూ.26,150కు చేరింది.

వెండి విషయానికి వస్తే కేజీ వెండి రూ.150 తగ్గి రూ.34,600కు చేరింది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 0.2 శాతానికి తగ్గి 1111.83 డాలర్లకు చేరటం గమనార్హం. మార్కెట్ పరంగా చూస్తే.. గత రెండు వారాల్లో ఇదే అత్యంత తక్కువ ధర. ప్రస్తుతం ఉన్న అంచనాల నేపథ్యంలో బంగారం ధర తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. సాధారణంగా దసరా.. దీపావళి సీజన్ వస్తుందంటే బంగారం ధర రైజింగ్ లో ఉంటుంది. ఈసారి మాత్రం నిరుత్సాహంగా ఉండటం విశేషం.

మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం.. ప్రస్తుతం నేల చూపులు చూస్తున్న బంగారం ధర దసరా సీజన్ నాటికి పెరిగే అవకాశం ఉందన్నఅభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దసరాకు మరో మూడు వారాల సమయం ఉన్న నేపథ్యంలో.. అప్పటికి ధర రికవరీ కావటం ఖాయమని చెబుతున్నారు. మొత్తంగా మరో వారంలో ఎప్పుడైతే మరో కనిష్ఠం నమోదు అవుతుందో.. వెంటనే బంగారం కొనుగోలు చేయటం మంచి కొనుగోలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News