హుజూరాబాద్ ఉప ఎన్నికపై గోనె సంచలన ఆరోపణ

Update: 2021-07-29 05:30 GMT
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత విధేయుడు.. ఆయనంటే ప్రాణం పెట్టేలా వ్యవహరించే నేతలు చాలామందే ఉంటారు. తెలుగు రాష్ట్రాలకు మధ్యనున్న విభేదాలకు అతీతంగా వారి అభిమానం సాగుతుంటుంది. అలాంటి నేతల్లో ఒకరు గోనెప్రకాశ్ రావు. ప్రస్తుతం రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటున్న ఆయన.. రాజకీయాల్లో మాత్రం యాక్టివ్ ఉంటున్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని అత్యంత దగ్గరగా చూసిన ఆయనకు.. ఇప్పుడు మంత్రి పదవులతోఉన్న వారు దగ్గర నుంచి కీలకస్థానాల్లో ఉన్న నేతలంతా ఆయనకు జూనియర్లు. ఆ మాటకు వస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. చాలా జూనియర్.

అప్పట్లో తనను కేసీఆర్ తరచూ డబ్బులు అడిగేవారని.. ఆయన అడిగిన మొత్తాన్ని ఇవ్వకుండా తగ్గించి డబ్బులు ఇచ్చేవాడినని ఆయన చెబుతుంటారు. మంచి వాగ్దాటితోపాటు.. మొహమాటం లేకుండా మాట్లాడే అతి కొద్దిమంది తెలుగు నేతల్లో ఆయన ఒకరుగా చెప్పాలి. అలాంటి ఆయన తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం భారీ ఎత్తున డబ్బుల్ని ఖర్చు పెట్టేందుకు ఏర్పాట్లు సాగుతున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఏదో మాటలకే పరిమితం కాకుండా.. హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా సాగే డబ్బుల పంపిణీపై ఎన్నికల కమిషన్ కు ఆయనో లేఖ రాశారు.

ఉప ఎన్నికల వేళలో టీఆర్ఎస్ పెట్టే ఖర్చు మీద నిఘా పెట్టాలన్నారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికను కేంద్ర పారామిలటరీ బలగాల పర్యవేక్షణలో జరగాలన్న ఆయన.. ఈ ఎన్నికలకు టీఆర్ఎస్ ఒక్క పార్టీనే రూ.700 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తుందని ఆరోపించారు. తనకున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఆ నియోజకవర్గంలో రూ.400 కోట్లను ఖర్చు చేశారని.. రానున్న కొద్ది రోజుల్లో మరో రూ.400 కోట్లు ఖర్చు చేసేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా దేశంలో మరెక్కడా లేనంత భారీగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోఖర్చు చేయనున్నట్లు చెప్పారు.

 తన అంచనా ప్రకారం వచ్చే నెలలో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. ఇటీవల జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా అధికారపక్షం భారీగా ఖర్చు చేసిందని.. ఓటుకు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు పంపిణీ చేశారన్నారు. ఈ ఉప ఎన్నిక మీద బోలెడన్ని ఫిర్యాదులు రావటాన్ని గుర్తు చేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో పెద్ద ఎత్తున బోగస్ ఓట్లను కూడా చేరుస్తున్నారని.. కొందరి ఓటర్ల పేర్లను వ్యూహాత్మకంగా లిస్టు నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా హుజూరాబాద్ఉప ఎన్నికను నిర్వహిస్తే.. కేసీఆర్ సర్కారు తన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. గోనె వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి.
Tags:    

Similar News