జేపీ న‌డ్డా కు గుడ్‌ న్యూస్‌....అమిత్‌ షా కీల‌క నిర్ణ‌యం

Update: 2020-01-13 03:45 GMT
బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కు ప్ర‌మోష‌న్ ద‌క్క‌నుంది.  ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కేబినెట్‌లో పార్టీ అధ్య‌క్షుడు అమిత్‌ షా హోంశాఖ మంత్రిగా వ్యవహరిస్తూ పార్టీ వ్య‌వ‌హారాలు స‌మ‌న్వ‌యం చేస్తున్నారు. అయితే,  ‘ఒక వ్యక్తి–ఒక పదవి’ సంప్రదాయం ప్రకారం పార్టీ అధ్యక్ష పదవిని జేపీ నడ్డా కు అప్ప‌గించేందుకు అమిత్‌ షా మొగ్గు చూపిన‌ట్లు స‌మాచారం. బీజేపీలోని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈనెల 20న లేదంటే వచ్చే ఫిబ్రవరిలో కొత్త జాతీయ అధ్యక్షుడి గా న‌డ్డా బాధ్య‌త‌లు స్వీక‌రించనున్నారు.


బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం జేపీ నడ్డాకు ఉన్న నేపథ్యంలో గ‌త ఏడాది జూన్‌లో న‌డ్డాకు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అప్పగించారు. హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి రాజ్యసభ కు ప్రాతినిథ్యం వహిస్తున్న జేపీ.. మోదీ గత ప్రభుత్వంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. గ‌త సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్‌గాబాధ్యతలు చేపట్టిన నడ్డా.. 62 ఎంపీ స్థానాల్లో గెలుపు కు కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ జాతీయ నాయకత్వం కీలకమైన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిలో నియమించింది. అనంత‌రం గ‌త ఏడాది చివరలో పలు రాష్ట్రల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగ‌గా...అమిత్‌షా సారథిగా న‌డ్డా ఉత్త‌మ‌మైన ప‌నితీరు క‌న‌బ‌ర్చిన‌ట్లు పార్టీ భావిస్తోంది. దీంతో ఆయ‌న్ను అధ్య‌క్షుడి గా నియ‌మించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కొన్ని నెలలుగా జరుగుతున్న సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ఈ మేరకు మార్పులు కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో సంక్రాంతి తర్వాత కసరత్తు ప్రారంభించాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. బీహార్‌, రాజస్థాన్‌, కర్ణాటక సహా కొన్ని రాష్ట్రాలకు పార్టీ కొత్త చీఫ్‌లను కూడా నియమించేందుకు అవకాశాలున్నాయి. రానున్న ఏడాది కాలంలో కీలకమైన రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ, బెంగాల్‌లో పార్టీ విస్తరణ బాధ్యతలు ఉండడంతో ఈ నియామ‌కం చేప‌ట్ట‌నున్నారు.
Tags:    

Similar News