అధికారిక ఫ‌లితాల వెల్ల‌డి ఎప్పుడో చెప్పేసిన ద్వివేది!

Update: 2019-05-19 05:05 GMT
సుదీర్ఘంగా సాగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఈ సాయంత్రం(ఆదివారం) ముగియ‌నున్న విష‌యం తెలిసిందే. దీంతో ఇప్పుడు అంద‌రి దృష్టి ఎగ్జిట్ పోల్స్ మీదా.. కౌంటింగ్ మీదా ప‌డింది. గ‌తానికి భిన్నంగా ఈసారి కౌంటింగ్ లో కొత్త రూల్ తెర మీద‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో.. అధికారిక ఫ‌లితం ఎన్ని గంట‌ల‌కు విడుద‌ల అవుతుంద‌న్నది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

ఈవీఎంల ఎంట్రీ త‌ర్వాత ఉద‌యం 11 గంట‌ల‌కు ఒక క్లారిటీ వ‌చ్చేస్తుండ‌గా.. మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌కు విజేత ఎవ‌రో స్ప‌ష్ట‌మ‌వుతున్న ప‌రిస్థితి. అందుకు భిన్న‌మైన ప‌రిస్థితులు రానున్న కౌంటింగ్ లో చోటుచేసుకోనున్నాయి. ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఐదు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు.. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్క స‌రిపోల్చే పెద్ద కార్య‌క్ర‌మం ఉండ‌టంతో అధికారిక ప‌లితం ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం ఉంది.

ఇదే విష‌యాన్ని తాజాగా ఏపీ రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారిక గోపాల‌కృష్ణ ద్వివేది వెల్ల‌డించారు. ఈ నెల 23 ఉద‌యం 8 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు స్టార్ట్ అవుతుంద‌ని.. తొలుత పోస్ట‌ల్ బ్యాలెట్ లు.. త‌ర్వాత స‌ర్వీసు ఓట్లులెక్క‌లోకి తీసుకుంటామ‌న్నారు. ఎనిమిదిన్న‌ర క‌ల్లా ఈవీఎంల‌లో న‌మోదైన ఓట్ల లెక్కింపు స్టార్ట్ అవుతుంద‌న్న ఆయ‌న‌.. ప్ర‌తి అర‌గంట‌కు ఒక రౌండ్ చొప్పున ఈవీఎంల‌లో న‌మోదైన ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుంద‌న్నారు.

మ‌ధ్యాహ్నం రెండు.. రెండున్న నాటికి ఈవీఎంల‌లో ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుంద‌ని.. ఆ త‌ర్వాత ఒక్కో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఐదేసి పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు.. వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించే కార్య‌క్ర‌మం మొద‌లువుతుంద‌ని చెప్పారు. ఇలా లెక్కించే ప‌ని ఒకేసారి ఐదు పోలింగ్ కేంద్రాల‌ను కాకుండా.. ఒకదాని త‌ర్వాత మ‌రొక‌టి చొప్పున చేస్తామ‌ని.. ఒక్కో పోలింగ్ కేంద్రంలో న‌మోదైన ఈవీఎం ఓట్లు.. వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్క‌కు అర‌గంట ప‌డుతుంద‌ని.. ఐదు చోట్ల అంటే రెండున్న‌ర గంట‌లు అదే ప‌డుతుంద‌ని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. అధికారిక ఫ‌లితం రాత్రి ప‌ది గంట‌ల‌కు కాని రాద‌న్న మాట ఆయ‌న చెప్పారు. సో.. అధిక్య‌త‌పై అవ‌గాహ‌న వ‌చ్చేసినా.. అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌టానికి.. తుది ఫ‌లితం రావ‌టానికి మాత్రం రాత్రి 10 గంట‌ల వ‌ర‌కూ వెయిట్ చేయ‌క త‌ప్ప‌దన్న మాట‌.
Tags:    

Similar News