టీడీపీ పొలిటిక‌ల్ క‌ప్పులో బుచ్చ‌య్య రాజ‌కీయ తుఫాను!

Update: 2021-08-19 15:30 GMT
టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి, ప్ర‌స్తుతం రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్య‌య్య చౌద‌రి రాజీనామా చేస్తారంటూ వచ్చిన వార్త ఆ పార్టీలో తీవ్ర క‌ల‌క‌లం రేపింది. వాస్త‌వానికి కొన్ని నెల‌లుగా తీవ్ర అసంతృప్తితో బుచ్చ‌య్య ర‌గిలిపోతున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. త‌న‌ను ఒంట‌రి వాణ్ని చేస్తున్నార‌ని.. ఆయ‌న త‌ర‌చుగా చెబుతున్నారు. అయితే.. ఎవ‌రూ కూడా ఆయ‌న రాజీనామా వార్త ఊహించ‌లేదు. పైగా.. తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో పాల్గొనేది లేద‌ని ప్ర‌క‌టించినా.. పార్టీకి వ్యూహాలు అందిస్తార‌ని అంద‌రూఅనుకున్నారు.

కానీ, అనూహ్యంగా బుచ్చ‌య్య‌.. రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించార‌నే వార్త‌లు రావ‌డంతో ఒక్క‌సారిగా అధిష్టానం కూడా ఉలిక్కి ప‌డింది. దీంతో వెంట‌నే మాజీ మంత్రులు నిమ్మ‌కాయల చిన‌రాజ‌ప్ప‌, రాజ‌మంద్రి పార్ల‌మెంటు పార్టీ ఇంచార్జ్ కేఎస్ జ‌వ‌హ‌ర్‌ల‌ను ఆయ‌న ఇంటికి పంపించి బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేసింది. ఇదిలావుంటే.. ఈ విష‌యంపై బుచ్చ‌య్య మీడియాతో మాట్లాడుతూ.. త‌న‌ను ఒంటరి వాణ్ని చేశార‌నేది వాస్త‌వ‌మేన‌ని చెప్పారు. అయితే.. తాను ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటుంద‌నే చెప్పారు.

“చంద్రబాబుని కలవడానికి నేను వెళ్ళాను..  మా నేతలు వెళ్లి మాట్లాడతారు.. నా నిర్ణయాన్ని బహిరంగంగానే త్వరలో తెలియజేస్తాను ఇప్పుడు ఏమి మాట్లాడలేను పార్టీ మనుగడ కోసమే నా పోరాటం” అని బుచ్చయ్య తెలిపారు. ఇలా ఉండగా, సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి రాజీనామా వార్తలపై   మాజీ హోం మంత్రి, టీడీపీ సీనియర్ నేత చిన రాజప్ప మాట్లాడారు. బుచ్చయ్య పార్టీకి రాజీనామా చేస్తారనేది అబద్ధమని రాజప్ప తేల్చారు. ఇదిలావుంటే.. గ‌త 2014లో విజ‌యం ద‌క్కించుకున్న బుచ్చ‌య్య‌.. మంత్రి ప‌దవిని ఆశించారు. అయితే.. అది ద‌క్క‌లేదు.

దీంతో ఒకింత ఆవేద‌న‌కు గురైన ఆయ‌న దాదాపు ఆరు మాసాల పాటు.. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్నారు. దీంతో అప్ప‌ట్లోనూ చంద్ర‌బాబు ఒక‌సారి బుచ్చ‌య్య‌ను బుజ్జ‌గించారు. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీని త‌ట్టుకుని విజ‌యం ద‌క్కించుకున్న త‌ర్వాత‌.. అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ ప‌ద‌విని అప్ప‌గించారు. అయితే.. జూనియ‌ర్ల‌కు కూడా ఈ ప‌ద‌విని ఇచ్చార‌ని.. త‌న‌కు ప్ర‌త్యేకంగా ఇచ్చిన గుర్తింపు ఏంట‌నేది.. బుచ్చ‌య్య ప్ర‌శ్న‌. దీనికి ఎవ‌రూ ఆన్స‌ర్ చేయ‌డం లేదు. పైగా.. ఇటీవ‌ల కాలంలో బుచ్చ‌య్య యాక్టివ్‌గా ఉంటున్న‌ప్ప‌టికీ.. పార్టీలో ఆశించిన మేర‌కు గుర్తింపు లేద‌నేది ఆయ‌న ఆవేద‌న‌.

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు బ‌చ్చ‌య్య చేసిన‌ట్టుగా వ‌చ్చిన రాజీనామా ప్ర‌క‌ట‌న పార్టీలో చ‌ర్చ‌కు దారితీసింది. వాస్త‌వానికి ఇప్ప‌టికే ఇబ్బందుల్లో ఉన్న పార్టీకి.. బుచ్చ‌య్య ప్ర‌క‌ట‌న గోరుచుట్టుపై రోక‌లిపోటుగా మారింద‌నే వాద‌న ఉంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ను బుజ్జ‌గించేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌ప్పుకొంటే.. రాజ్య‌స‌భ‌కు పంపించాల‌నే ఆలోచ‌న ఆయ‌న చేస్తున్నారు. దీనిపైఊ చంద్ర‌బాబు నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు హామీ లేదు. బ‌హుశ ఈ విష‌యంలోనే గోరంట్ల అలిగి ఉంటార‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News