రైతుల ఆత్మహత్యలకు దెయ్యాలే కారణమ‌ట‌

Update: 2016-07-21 09:11 GMT
రైతుల ఆత్మ‌హ‌త్య‌లు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ‌మంత‌టా జ‌రుగుతున్నాయి. ఆ పాపానికి బాధ్య‌త వ‌హించాల్సిన ప్ర‌భుత్వాలు ఆ ప‌నిచేయ‌క‌పోగా విచిత్ర‌మైన కార‌ణాలు చెబుతున్నాయి. పంట‌లు గిట్టుబాటు కాక‌, ప్ర‌భుత్వం చేయూత లేక రైతులు ప్రాణాలు తీసుకుంటుంటే ఆ త‌ప్పు త‌మ‌ది కాదంటూ ప్ర‌భుత్వాలు వింత‌వింత కార‌ణాలు చెబుతున్నాయి.  ఆత్మహత్యలకు కారణాలు విశ్లేషించి వాటిని నిరోధించే చర్యలు తీసుకోవల్సిన ప్రభుత్వాలు విడ్డూరమైన ప్రకటనలు చేస్తున్నాయి. తాజాగా మ‌ధ్య ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌మ రాష్ట్రంలో రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు గ‌ల కార‌ణమేంట‌న్న‌ది చెప్ప‌డంతో అది విన్న‌వారంతా ఇది ప్ర‌భుత్వ‌మా లేదంటే ఇంకేదైనానా అని మండిప‌డుతున్నారు. రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు దెయ్యాలు కార‌ణ‌మ‌ని ఏకంగా అసెంబ్లీలోనే మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చెప్ప‌డంతో అక్క‌డి విప‌క్షాలు ఎండ‌గ‌డుతున్నాయి.

గత మూడేళ్లుగా మధ్యప్రదేశ్‌ లో 418 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే ఇందుకు కారణం వారందరికీ దెయ్యాలు పూనడమేనని మధ్యప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. అంతేకాదు... ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతుల కుటుంబాలకూ అదే స‌మాచారం ఇచ్చార‌ట‌.  ఈ మేర‌కు ఆ రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం అక్క‌డి హోం మంత్రి భూపేందర్‌ సింగ్ లిఖితపూర్వకంగా ఈ  సమాధానం ఇవ్వ‌డంతో గంద‌ర‌గోళం ఏర్ప‌డింది.

మ‌ధ్య ప్ర‌దేశ్ లో ఒక్క రైతు కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకోలేదని చెప్పిన ఆయ‌న అంద‌రూ దెయ్యాల వ‌ల్ల చ‌నిపోయార‌ని చెప్పారు. దెయ్యాలు పూనడం వల్లే రైతులు మరణించారంటూ మంత్రే చెప్పడంపై కాంగ్రెస్ నేత‌లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం దెయ్యాలను నమ్ముతుందా అని వారు ప్ర‌శ్నించ‌డంతో ఏం స‌మాధానం చెప్పాలో తెలియ‌క అధికార ప‌క్షం నోరు మెద‌ప‌కుండా ఉండిపోయింది.

ప్ర‌ధాని మోడీ ఇచ్చిన ర్యాంకింగుల్లో రెండో స్థానంలో ఉన్నార‌ని చెబుతున్న శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ప్ర‌భుత్వంలో ఇలా దెయ్యాలు విజృంభిస్తుంటే ఆ రాష్ర్టంలోని, కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఏం చేస్తుందో మ‌రి. బాధ్యతాయుత‌మైన ప్ర‌భుత్వం చెబుతున్న పిచ్చి స‌మాధానం వింటుంటే ప్ర‌భుత్వానికి కూడా దెయ్యం పట్టిన‌ట్లుంద‌ని అంటున్నారు.
Tags:    

Similar News