ప్రభుత్వ ఉద్యోగులు ఫ్లవర్లు కాదు.. ఫైర్ అన్నది జగన్ సర్కారుకు తెలిసినట్లే!

Update: 2022-02-03 11:30 GMT
ఫుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావేమో.. ఫైర్ అంటూ అల్లుఅర్జున్ తెర మీద డైలాగుతో చెలరేగిపోతే.. తమకొచ్చే జీతంలో కోత పెట్టిన జగన్ సర్కారుకు.. రియల్ లైఫ్ లో తమలోని ఫైర్ చూపించి షాకిచ్చారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో తమ ప్రభుత్వంపై విరుచుకుపడే వారు ఎవరైనా సరే.. వారికి అంతే ధీటుగా కౌంటర్లు ఇవ్వటం ఇప్పటివరకు చూసిన ఏపీ ప్రజలకు.. తాజా సీన్ మాత్రం సరికొత్తగా ఉందని చెప్పాలి. తమను ఏరి కోరి ఓట్లు వేసి.. వేయించి మరీ అధికారంలోకి తీసుకొచ్చినప్పటికీ.. వారికి సైతం షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వాలనుకున్న ప్రభుత్వ వ్యూహకర్తలకు ఇప్పుడు దిమ్మ తిరిగిపోతున్న పరిస్థితి.

ఎవరికైనా ఒకటే రూల్ అన్నది అందరి విషయంలో వర్కువుట్ కాదన్న విషయం తాజాగా ఏపీలోని జగన్ సర్కారుకు అర్థమై ఉంటుంది. తమ మూడేళ్ల ప్లస్ పాలనతో ఇప్పటివరకు తమతో పోరు చేసే వారికి మళ్లీ లేవలేని రీతిలో షాకిచ్చే ఏపీ అధికారపక్షానికి.. వారికి అర్థమయ్యే భాషలో షాకిచ్చిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. అంచనాలకు మించి బెజవాడలో తలపెట్టిన నిరసన ర్యాలీకి తరలి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులతో ఏపీ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయ్యింది.

ఏదో ఒకటి చేసి.. ఏపీ వ్యాప్తంగా ఊళ్ల నుంచి విజయవాడకు వచ్చే అన్ని ప్రాంతాల్లో నిఘా వేసి మరీ.. అడ్డుకున్న పోలీసులు తీరుతో ప్రభుత్వ ఉద్యోగులు మరింత కాలిపోయేలా చేసిందని చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో న్యాయంగా తమకు లభించే నిరసనకు అవకాశం లేకుండా అణగదొక్కేస్తున్న వారికి బుద్ధి చెప్పాలనుకున్న ప్రభుత్వ ఉద్యోగులు.. ఊహించని రీతిలో చెలరేగిపోయారనే చెప్పాలి.

అంచనాలకు మించిన ఉత్సాహంతో ప్రభుత్వంపై తమకున్న ఆగ్రహాన్ని బయటకు వెళ్లగక్కేందుకు ఏ మాత్రం వెనుకాడని తీరు చూస్తే.. ప్రభుత్వంపై ఇంతటి నిరసన ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉందా? అని అధికారపక్ష నేతలే విస్మయానికి గురయ్యే పరిస్థితి. ఇంతకాలం ప్రభుత్వం ఉద్యోగులే కదా? అని లైట్ తీసుకోవటం ఎంతటి తప్పన్న విషయం వారికి ఇప్పుడు అర్థమయ్యేలా చేసిందంటున్నారు. మిగిలిన వారితో వ్యవహరించిన వ్యూహాన్నే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనూ అమలు చేయటం పెద్ద పొరపాటుగా ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటివరకు తాము ప్రభుత్వ ఉద్యోగుల్ని ఫ్లవర్లుగా భావించామే తప్పించి.. వారిలో ఇంతటి ఫైర్ ను అంచనా వేయలేదని ప్రభుత్వంలోని కీలక నేతలు కొందరు లోగుట్టుగా చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర తీస్తున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నిరసనను తక్కువగా అంచనా వేయటమే సర్కారు చేసిన పెద్ద తప్పు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. ప్రభుత్వం ముందు ఫ్లవర్లుగా ఉండాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ఈస్థాయిలో ఫైర్ కావటం..ఏపీ సర్కారు చేసిన స్వయంకృతం తప్పించి మరింకేమీ లేదంటున్నారు.
Tags:    

Similar News