దేశ ప్రజల టెన్షన్ తగ్గిస్తూ కేంద్రం చెప్పిన రెండు గుడ్ న్యూస్ లు

Update: 2020-12-28 03:56 GMT
కొత్త సంవత్సరం దగ్గరకు వస్తుంటే.. ఆ ఉత్సాహమే వేరుగా ఉంటుంది. అందుకు భిన్నంగా కేంద్రం ఇచ్చిన డెడ్ లైన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో.. దేశ ప్రజలకు ఊరట కలిగించేలా రెండు కీలక నిర్ణయాల్ని ప్రకటించారు. దీంతో.. ఇప్పటివరకు టెన్షన్ పడుతున్న వారికి భారీ రిలీఫ్ లభించినట్లుగాచెప్పాలి. ఇంతకూ.. కేంద్రం చెప్పిన ఆ రెండు గుడ్ న్యూస్ లు ఏమంటే?

డ్రైవింగ్ లైసెన్స్.. వాహన రిజిస్ట్రేషన్.. ఫిట్ నెస్ సర్టిఫికెట్.. ఇలాంటివి లేవన్న టెన్షన్ అక్కర్లేదు. ఇవేమీ లేకుండా కొత్తగా అమల్లోకి వచ్చే వాహన చట్టం దెబ్బకు గూబ గుయ్యమనేలా భారీ జరిమానాలు తప్పవు. అయితే..కరోనా నేపథ్యంలో ఇలాంటి డాక్యుమెంట్లు లేని వారికి రిలీఫ్ ఇచ్చింది కేంద్రం. వాహనాల ధ్రువీకరణ పత్రాల క్రమబద్దీకరణకు జనవరి ఒకటిగా ఉన్న తుది గడువును తాజాగా పెంచింది.

తాజాగా కేంద్ర రవాణా.. రహదారుల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం సరైన ధ్రువీకరణ పత్రాలు లేని కారణంగా కొత్త చట్టాల ప్రకారం జనవరి ఒకటి నుంచి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ గడువును వచ్చే ఏడాది మార్చి 31వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా కట్టడి కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా పనులు చేసుకోని వారికి.. గడువు తక్కువగా ఉండటంతో.. చాలామందికి పనులు పూర్తి కాలేదు. ఈ ఇబ్బందిని పరిగణలోకి తీసుకున్న కేంద్రం.. ఈ డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవటానికి మరో మూడు నెలల గడువును ఇచ్చింది. అయితే.. చాలామందికి ఇక్కడో సందేహం రావొచ్చు. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వారిపై చర్యలు ఉండవా? అంటే.. ఉంటాయనే చెప్పాలి.

కాకుంటే.. ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్సు ఉండి.. దాని గడువు పూర్తి అయి.. రెన్యువల్ చేసుకోలేని వారి మీద మాత్రమే చర్యలు తీసుకోరు. కొత్త చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్సు గడువు తీరిన తర్వాత.. రెన్యువల్ చేసుకోకుంటే భారీ జరిమానా విధిస్తారు. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. అలాంటి వారి మీద ఎలాంటి చర్యలు ఉండవు. కాకుంటే.. వచ్చే ఏడాది మార్చి 31లోపు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.

మరో శుభవార్త ఏమంటే.. ఐటీ రిటర్న్ ను దాఖలు చేయటానికి ఈ ఏడాది డిసెంబరు 31 వరకు మాత్రమే గడువు ఉంది. అయితే.. కరోనా.. లాక్ డౌన్ కారణంగా రిటర్నును దాఖలు చేసుకోని వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరో మూడు రోజుల్లో వీరంతా రిటర్ను దాఖలు చేసుకోవటం కష్టం కానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. గత ఏడాది వార్షిక ఐటీ రిటర్న్ ను దాఖలు చేయని వారు వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 లోపు దాఖలు చేసుకోవచ్చన్నారు. కరోనా కారణంగా చాలా కార్యకలాపాలు స్థంభించిపోవటంతో.. ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో.. ఇప్పటివరకు రిటర్ను దాఖలు చేయని వారికి మరోరెండు నెలల అదనపు సమయం లభించినట్లే.
Tags:    

Similar News