పవన్ను లెక్కేచేయని ప్రభుత్వం

Update: 2021-11-08 06:12 GMT
‘అంతన్నాడింతన్నాడే గంగరాజు’ అనే పాట ఒకటుంది తెలుగులో. జనసేన అధినేత పవన్ కల్యాన్ వ్యవహారం చూసిన తర్వాత జనాలు ఇపుడీ పాటనే గుర్తుకు చేసుకుంటున్నారు. పదిరోజుల క్రితం వైజాగ్ లో జరిగిన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడితో భేటీ జరిపేందుకు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళాలని పవన్ చెప్పిన విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రభుత్వానికి పవన్ ఒక వారంరోజులు గడువిచ్చారు.

ఇపుడా వారంరోజుల గడువు ముగిసిపోయింది. పవన్ వార్నింగును ప్రభుత్వం అసలు పట్టించుకోనేలేదు. వారంరోజుల్లో ప్రభుత్వం గనుక అఖిలపక్షాన్ని తీసుకెళ్ళే విషయంలో నిర్ణయం తీసుకోకపోతే తర్వాత ఆకాశం బద్దలైపోతుందన్నంతగా బిల్డప్ ఇచ్చారు. తీరా చూస్తే పవన్ అసలా విషయంపై ఎక్కడా మాట్లాడటంలేదు. తాను పెట్టిన డెడ్ లైన్ను ప్రభుత్వం పట్టించుకుంటున్న సూచనలు కనబడనపుడు పవన్ ఏమి చేయాలి ? తానే ప్రతిపక్షాలను సమావేశానికి పిలవాలి.

అలాగే ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో మాట్లాడి మోడి అపాయిట్మెంట్ తీసుకని తానే అఖిలపక్షం నేతలతో పాటు స్టీల్ ప్లాంటు కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలను ఢిల్లీకి తీసుకెళ్ళాలి. కానీ పవన్ ఇదేమీ చేస్తున్నట్లు కనబడటంలేదు. ఎంతసేపు ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇవ్వటం, డెడ్ లైన్లు పెట్టడంతోనే కాలం గడిపేస్తున్నారు. పవన్ డెడ్ లైన్ పెడితే ప్రభుత్వం పట్టించుకుంటుందా ? భయపడి దిగొస్తుందా ? ఏ విషయంలో కానీ స్ధిరమైన అభిప్రాయం, స్ధిరమైన నిర్ణయం లేని తనను చూసి ప్రభుత్వం భయపడుతుందని పవన్ అనుకుంటే అంతకన్నా అమాయకత్వం మరొకటుండదు.

మొదటినుండి పవన్ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో రాంగ్ ట్రాకులోనే నడుస్తున్నారు. నిజానికి పవన్ డెడ్ లైన్ పెట్టదలచుకుంటే పెట్టాల్సింది కేంద్రప్రభుత్వానికి నరేంద్రమోడికి మాత్రమే. ఒకసారేమో స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆగేదికాదంటారు. మరోసారేమో అందరు కలిస్తే ప్రైవేటీకరణను ఆపచ్చంటారు. ఇంకోసారేమో ప్రైవేటీకరణకు రాష్ట్రప్రభుత్వాన్నే తప్పుపడతారు. కేంద్రప్రభుత్వ సంస్ధను కేంద్రం ప్రైవేటీకరిస్తోందన్న కనీసం ఇంగితం కూడా పవన్లో కనబడటంలేదు.

నిజంగానే స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఆపాలని పవన్ కు ఉంటే మాట్లాడాల్సింది మోడితోనే అన్న విషయం పవన్ కు తెలీదా ? పోరాటం చేయదలిస్తే మోడికి వ్యతిరేకంగా చేయాలి కానీ మధ్యలో జగన్ను బాధ్యుడిని చేస్తే ఏమొస్తుంది. ఒకవైపు వైసీపీ ప్రభుత్వంపై నమ్మకం లేదంటునే మరోవైపు ప్రభుత్వమే చొరవ చూపాలని డిమాండ్ చేయటంలోనే పవన్ రాజకీయముంది. అందుకనే పవన్ను ఇటు కార్మిక, ఉద్యోగ సంఘాలు అటు ప్రభుత్వం కూడా చాలా లైటుగా తీసుకున్నది. తాను పెట్టిన డెడ్ లైన్ను ప్రభుత్వం పట్టించుకోలేదు కదా మరిపుడు పవన్ ఏమి చేస్తారో చూడాలి.


Tags:    

Similar News