తేల్చేశారు: చిన్నమ్మ విధేయుడే సీఎం

Update: 2017-02-16 08:09 GMT
పదకొండు రోజుల పొలిటికల్ థ్రిల్లర్ కు శుభం కార్డు పడినట్లే.  తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని చేపట్టాల్సిందిగా అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత పళనిస్వామికి  గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో.. అన్నాడీఎంకేలో కొద్ది రోజులుగా సాగుతున్న అంతర్గత పోరు ఒక కొలిక్కి వచ్చినట్లేనని చెప్పాలి. అమ్మకు వీర విధేయుడైన పన్నీర్ సెల్వం తిరుగుబాటుతో మొదలైన సంక్షోభం అంతకంతకూ పెరిగిపెద్దది కావటమే కాదు.. చిన్నమ్మ జైలుకు వెళ్లగా.. పన్నీర్  ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్నారు.

మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న పళనిస్వామికి ముఖ్యమంత్రి పగ్గాలు ఇవ్వాల్సింది న్యాయనిపుణులు పలువురు విద్యాసాగర్ రావుకు సూచన చేయటంతో ఆయన.. ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు. రెండు వారాల్లోపళనిస్వామి తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ సాయంత్రం 4.30 గంటలకు పళనిస్వామి రాజ్ భవన్ లో జరిగే కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

గవర్నర్ నిర్ణయంతో శశికళ వర్గం ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. గవర్నర్ నిర్ణయం ప్రజాస్వామ్యబద్ధంగా ఉందన్న వ్యాఖ్యల్ని చేస్తున్నారు. తాజా నిర్ణయంతో పన్నీర్ వర్గంలో నైరాశ్యంలోకి కూరుకుపోయింది. అసెంబ్లీ సాక్షిగా బలాబలాల్ని నిరూపించుకునేందుకు గవర్నర్ అవకాశం ఇస్తారని భావించిన పన్నీర్ కు.. రాజ్ భవన్ నుంచి వెలువడిన ఉత్తర్వులు షాకింగ్ గా మారాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News