చంద్రుళ్ల మీద న‌ర‌సింహుడికి కోప‌మొచ్చింది

Update: 2017-06-13 05:29 GMT
ఇంత‌వ‌ర‌కూ లేని స‌రికొత్త ప‌రిణామం తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంది. విభ‌జ‌న జ‌రిగి మూడేళ్లు అవుతున్నా.. నేటికీ రెండు రాష్ట్రాల మ‌ధ్య పంచాయితీలు ఒక కొలిక్కి రాక‌పోవ‌టమే కాదు.. ఎప్ప‌టికి వ‌స్తాయోన‌న్న సందేహం ప‌ట్టి పీడించే ప‌రిస్థితి. రెండు రాష్ట్రాల మ‌ధ్య‌నున్న ఇష్యూల‌ను క్లోజ్ చేసేందుకు త‌నంత‌ట తానే ముందుకు వ‌చ్చిన గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌.. రాజీ కుదుర్చేందుకు ప్ర‌య‌త్నాలు షురూ చేశారు.

ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. నిర్ణ‌యాలు తీసుకున్నా.. అమ‌లు విష‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు అనుస‌రిస్తున్న వైఖ‌రిపై గ‌వ‌ర్న‌ర్ గుర్రుగా ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య‌నున్న విభ‌జ‌న వివాదాల్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు వీలుగా.. రెండు రాష్ట్రాల మంత్రుల క‌మిటీని కూర్చొబెట్టి వివాదాల్ని ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే.. ఇలా తీసుకున్న నిర్ణ‌యాల్ని అమ‌లుకు ఎవ‌రూ ప్ర‌య‌త్నించ‌క‌పోవ‌టంపై ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.  ఈ మాత్రానికి స‌మావేశాలు.. చ‌ర్చ‌లు ఎందుకంటూ తీవ్ర అస‌హ‌నానికి గుర‌వుతున్నార‌ట‌. ఇత‌ర రాష్ట్రాల సీఎంల‌తో భేటీ అయిన‌ప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల తీరును ఆయ‌న త‌ప్పు ప‌ట్ట‌ట‌మే కాదు.. అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. విభ‌జ‌న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు స్వ‌యంగా త‌న వ‌ద్ద‌కు హాజ‌ర‌య్యే వ‌ర‌కూ తాను ఈ విష‌యాల్ని ప‌ట్టించుకోన‌ని తేల్చేసిన‌ట్లుగా చెబుతున్నారు. వివాదాల ప‌రిష్కారంకోసం రెండు తెలుగు రాష్ట్రాల మంత్రుల క‌మిటీలు గ‌వ‌ర్న‌ర్ నేతృత్వంలో స‌మావేశ‌మైనా.. వాటి అమ‌లు విష‌యంలో రెండు ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోక‌పోవ‌టాన్ని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్న‌ట్లుగా స‌మాచారం.

ఇంత‌వ‌ర‌కున్న వివాదాలు స‌రిపోవ‌న్న‌ట్లుగా తాజాగా విద్యుత్ బ‌కాయిల విష‌యంలో రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు పోటాపోటీగా లేఖాస్త్రాల్ని సంధించుకోవ‌టం.. ఎవ‌రికి వారుగా నిర్ణ‌యం తీసుకొని విద్యుత్ పంపిణీని నిలిపివేయ‌టంపై ఆయ‌న తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఇలాంటి వేళ‌.. మంత్రుల క‌మిటీతో తాను స‌మావేశం అయ్యేది లేద‌ని న‌ర‌సింహ‌న్ నిర్ణ‌యించుకున్నార‌ట‌.

హైద‌రాబాద్ స‌చివాల‌య‌లో ఏపీ అధీనంలో ఉన్న భ‌వ‌నాల్ని త‌మ‌కు అప్ప‌గించాల‌ని గ‌త జ‌న‌వ‌రిలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం తీర్మానం చేసింది. దీని అమ‌లుకు గ‌వ‌ర్న‌ర్ తో సంబంధం ఉండ‌టంతో ఈ తీర్మానాన్ని గ‌వ‌ర్న‌ర్‌కు పంపింది. దీంతో గ‌వ‌ర్న‌ర్ రంగంలోకి దిగి ఏపీ స‌ర్కారుతో ప్ర‌త్యేకంగా రాయ‌బారం న‌డిపారు. వివాదాల్ని ప‌రిష్క‌రించుకునేందుకు రెండు రాష్ట్రాల మంత్రుల క‌మిటీ హాజ‌రు కావాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మొత్తం 42 అంశాల‌పై ఏకాభిప్రాయం వ‌చ్చిన‌ట్లుగా వెల్ల‌డించారు. అయితే.. అమ‌లు విష‌యానికి వ‌స్తే.. ఒక్క‌టీ కాక‌పోవ‌టంపై ఆయ‌న నొచ్చుకున్నార‌ట‌. విద్యుత్ వివాదం విష‌యంలోనూ రెండు రాష్ట్రాల సీఎండీలు మాట్లాడుకొని నివేదిక‌ల ఆధారంగా ప‌రిష్కారం చేసుకునేందుకు క‌మిటీలు అంగీక‌రించినా.. కార్యాచ‌ర‌ణ లేకుండా పోయింద‌న్న మాట వినిపిస్తోంది. తొమ్మిది.. ప‌దో షెడ్యూల్‌లోని 42 సంస్థ‌ల‌పై ఏకాభిప్రాయం వ‌చ్చింద‌ని చెప్పినా.. ఎలాంటి ఉప‌యోగం లేకుండా పోయింద‌ని.. ఇందుకు సంబంధించి విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకోక‌పోవ‌టంపై గ‌వ‌ర్న‌ర్ తీవ్ర అస‌హ‌నంతో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇక‌పై.. మంత్రుల క‌మిటీల‌తో స‌మావేశం అయ్యేది లేద‌ని.. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు స‌మావేశ‌మైతే త‌ప్పించి.. తాను జోక్యం చేసుకోకూడ‌ద‌ని గ‌వ‌ర్న‌ర్ అనుకుంటున్న‌ట్లుగా తెలిసింది. ఎప్పుడూ లేని విధంగా ఇద్ద‌రు చంద్రుళ్ల తీరుపై గ‌వ‌ర్న‌ర్ గుర్రుగా ఉన్న వైనం ఎక్క‌డి వ‌ర‌కూ వెళుతుంద‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News