మ‌న గ‌వ‌ర్న‌ర్ గారికి ఇంకో చాన్స్

Update: 2017-04-29 06:48 GMT
ఈఎస్‌ఎల్ నరసింహన్...తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్. మ‌రో ప‌ది రోజుల్లో ఆయన గ‌వ‌ర్న‌ర్ గిరీ పదవీ కాలం ముగుస్తుంది. ఈ నేప‌థ్యంలో స‌హా కొత్త గవర్నర్ వస్తారా? మరోసారి ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తారా? అనే ఊహాగానాలు - చ‌ర్చోప‌చ‌ర్చ‌లు ఉంటాయి. అయితే గ‌వ‌ర్న‌ర్ గారికి మ‌రో చాన్స్ వ‌స్తుంద‌ట‌. మరే గవర్నర్‌ కు లేని విధంగా నరసింహన్ అనేక ప్రత్యేకతలు చాటుకోవ‌డం, ఏపీ-తెలంగాణ‌లో ఉన్న పేచీలే న‌ర‌సింహ‌న్‌ కు పొడ‌గింపు చాన్స్ ఇస్తాయ‌ని అంటున్నారు.

ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఎన్‌ డీ తివారీ ఉన్నప్పుడు రాజ్‌ భవన్‌ లో అభ్యంతరకరమైన కార్యకలాపాలు వెలుగులోకి రావడంతో అప్పటికప్పుడే ఆయనను తొలగించి, చత్తీస్‌ గఢ్ గవర్నర్‌ గా ఉన్న నరసింహన్‌ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక గవర్నర్‌ గా 2009 డిసెంబర్ 27న నియమించారు. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న కాలంలో నరసింహన్ గవర్నర్‌ గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం - ఆంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమాలను చూశారు. 2010 వరకు చత్తీస్‌ గఢ్ గవర్నర్‌ గా బాధ్యతలు నిర్వహించి ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రానికి పూర్తి కాలం గవర్నర్‌ గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ - సమైక్యాంధ్ర ఉద్యమ కాలంలో గవర్నర్ కీలక పాత్ర వహించారు. రాష్ట్రంలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు కేంద్రానికి వివరించారు. దాదాపు మూడు దశాబ్దాల తరువాత రాష్ట్రంలో రాష్టప్రతి పాలన విధించారు. రాష్టప్రతి పాలనలో సర్వాధికారిగా గవర్నర్ వ్యవహరించారు.

అనంతరం 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడిన తరువాత రెండు రాష్ట్రాలకూ గవర్నర్‌ గా ఉన్నారు. వారం రోజుల్లో గవర్నర్ మార్పు అనే ప్రచారం మూడేళ్ల నుంచి గట్టిగా సాగినా - నరసింహన్ మాత్రం అలానే ఉన్నారు. ఎనిమిదేళ్ల నుంచి గవర్నర్‌ గా ఉన్నారు. అయితే, విభజన జరిగి మూడేళ్లు కావస్తున్నా ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పలు వివాదాలు అలానే ఉన్నాయి. ఉభయ రాష్ట్రాల మంత్రులు - అధికారులతో గవర్నర్ అనేక సార్లు సమావేశాలు నిర్వహించారు. అయినా ఉద్యోగుల పంపిణీ - ఆస్తుల పంపిణీ వంటి పలు సమస్యలు అలానే ఉన్నాయి.

హైకోర్టు విభజన-ఆస్తుల పంపకం- నీటిపారుదల ప్రాజెక్టుల అంశాల్లో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఇంకా అలానే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో రెండు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్‌ లను నియమించడం కన్నా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నరసింహన్‌ ను కొనసాగించే అవకాశం ఉందని అధికార వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తంగా గ‌వ‌ర్న‌ర్ గారికి పొడ‌గింపు చాన్స్ ఎక్కువే అనేది మెజార్టీ వ‌ర్గాల అభిప్రాయం. కేంద్రం నిర్ణ‌యం ఏ విధంగా ఉంటుందో చూడాలి మ‌రి!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News