ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన గవర్నర్

Update: 2017-05-05 04:26 GMT
తెలుగు రాష్ర్టాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వీకాలం పొడ‌గింపు వ‌చ్చిన నేప‌థ్యంలో గవర్నర్ ఈఎస్‌ ఎల్‌ నరసింహన్ మొద‌టి సారి మీడియాతో  మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ తన తనయులు లాంటివారని చెప్పారు.వయసులో ఇద్దరు ముఖ్యమంత్రులకన్నా తాను పెద్దవాడినని, ఇద్దరు సీఎంలను కొడుకుల్లా భావిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రులు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నారని గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. ఉగాది- రిపబ్లిక్ డే-భారత రాష్ట్రపతికి తామిచ్చిన విందుకు చంద్రబాబు, కేసీఆర్‌ లు హాజరయ్యారని, ఒకరినొకరు పలకరించుకోవడమే కాకుండా మాట్లాడుకున్నారని గుర్తు చేశారు. కేసీఆర్‌ నిర్వహించిన యాగానికి చంద్రబాబు ప్రత్యేకంగా హాజరైతే.. రాజధాని అమరావతిలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్‌ వచ్చారని గవర్నర్‌ చెప్పారు. విశాఖపట్నంలో హుదూద్‌ తుపాన్‌ వచ్చినప్పుడు సీఎం కేసీఆర్‌ స్పందించి తెలంగాణ ప్రభుత్వం నుంచి విద్యుత్‌ అధికారులు - ఉద్యోగులను పంపించడంతో పాటు మెటీరియల్‌ ను కూడా అందజేశారని గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ గుర్తుచేశారు. స‌త్సంబంధాల‌ల‌తో పాటు ఇరువురు పోటీపడి ఆయా రాష్ట్రాలను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారని  చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు గడిచిన అధ్యాయమని, సమస్యలు త్వరలోనే తొలగిపోతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు అటూ.. ఇటూ పర్యటించాలన్నది తన భవిష్యత్‌ స్వప్నమని, ఇప్పుడున్న వివాదాలు తాత్కాలికమేనని ఆయన వివరించారు.

గవర్నర్‌ గా మరికొంతకాలం కొనసాగాలని రాష్ట్రపతి కార్యాలయం తనను కోరిందని గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక రాష్ట్ర విభ‌జ‌న ప‌రిస్థితుల‌ను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో తానెంతో ఒత్తిడికి గురయ్యానని, విభజన సమయంలో రాత్రిపూట నిద్ర కూడా పట్టేది కాదని ఆయ‌న అన్నారు. తెల్లవారు లేచాక హమ్మయ్య.. నిన్న గడిచిపోయింది అని అనుకునేవాడినని పేర్కొన్నారు. రెండు తెలుగు ప్రభుత్వాలు కలిసి పనిచేసుకుంటున్నాయని, తాను గవర్నర్‌ గా వచ్చినప్పుడు పరిస్థితి ఎంతో ఉద్రిక్తంగా ఉండేదని, అప్పట్లో శాంతి భద్రతలపై పోలీసు అధికారులకు మార్గనిర్దేశన చేశానని చెప్పారు. నాగార్జునసాగర్‌ వివాదం తలెత్తినప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచి మాట్లాడానని, హైదరాబాద్‌లో భద్రతపై అప్పట్లో అందరూ ఆందోళన చెందారని, ఇప్పుడు ప్రశాంతంగా ఉందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు రెండూ పరస్పరం సహకరించుకోవాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్లడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. తాను ఐపీఎస్‌ అధికారి అయినప్పటికీ.. కేవలం 13 మాసాలు మాత్రమే యూనిఫాం వేసుకున్నానని, మిగతా సమయమంతా నిఘా విభాగంలో పనిచేశానని చెప్పారు. గవర్నర్‌గా తనకు రెండు ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, అధికారులు పూర్తిస్థాయిలో సహకరించారని చెప్పారు. పరిస్థితులు ప్రభావం వల్లే తాను ఎక్కువ రోజులు గవర్నర్‌గా కొనసాగానని, గవర్నర్‌గా తాను ఎదుర్కొన్న సమస్యలను వ్యక్తిగతంగా తీసుకోలేదని చెప్పారు.

రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడుతుంటే ఎంతో సంతోషంగా ఉందని.. ప్రతి వారిలో చిరునవ్వు చూడాలన్నదే తన అభిమతమని నరసింహన్‌ చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ బాగా పనిచేస్తున్నారని, అభివృద్ధిలో పోటీ పడుతున్నారని చెప్పారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్‌లో రెండు ప్రభుత్వాలకు ప్రతిష్టాత్మకమైన అవార్డులు దక్కడం సంతోషకరమన్నారు. ఈ అవార్డులను రెండు ప్రభుతాలు పొందడం పట్ల తానెంతో సంతోషించానని చెప్పారు. ఒక కుటుంబంలో ఆస్తుల బదలాయింపులో వివాదాలు చోటు చేసుకుంటాయని, రాష్ట్రం విడిపోయినప్పుడు రెండు రాష్ట్రాల మధ్య గొడవలు రావడం సహజమేనని చెప్పారు. ప్రస్తుతం వివాదాలన్నీ సమసిపోయాయని, మిగిలినవి కూడా దశలవారీగా పరిష్కారమ వుతాయని చెప్పారు. రాత్రికి రాత్రే సమస్యలు పరిష్కారం కావాలంటే ఎలా? అని ప్రశ్నించారు.

తెలుగు ప్రభుత్వాలు రెండూ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు సంబంధించి ఇద్దరు సీఎంలు తన దగ్గరకు వచ్చి మాట్లాడి సూచనలు, సలహాలు తీసుకుం టారని పేర్కొన్నారు. గవర్నర్‌గా ప్రతిరోజు సవాలేనని, ప్రతి సవాల్‌ ఒక అనుభవాన్ని తెచ్చిపెడ్తుందని అన్నారు. తన పదవీకాలం ముగిశాక తాను చెన్నైలో స్థిరపడతానని, అప్పుడు తెలుగు ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధిని పత్రికలలో చదివి, ఎలక్ట్రానిక్‌ మీడియాలలో వీక్షించి సంతోషిస్తానని చెప్పారు. రాష్ట్రం విడిపోయినందున తెలుగు ప్రజలు పరస్పరం సహకరించుకుని ముందుకు సాగాలని కోరారు. తెలుగు ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు వచ్చే ఏడాది నుంచి అందుతాయని, రెండు ప్రభుత్వాలు అభివృద్ధిలో దూసుకుపోవాలన్నదే తన అభిమతమని చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులు తాను ఇచ్చిన సలహాలు, చెప్పిన విషయాలు శ్రద్ధగా విని, వాటిని అమలు చేశారన్నారు. తాను ఎక్కువగా ఆలయాల చుట్టూ తిరుగుతున్నాననే ఆరోపణలు విని ఎంతో బాధపడేవాడినని అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News