85 శాతం హ్యాపీ లెక్క ఎలా గ‌వ‌ర్న‌ర్ సాబ్‌?

Update: 2018-01-26 10:23 GMT
గ‌తానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌. వివాదాస్ప‌ద అంశాలు.. మీడియాలో ఎక్కువ‌గా ఫోక‌స్ అయ్యే అంశాల విష‌యంలో మాట్లాడ‌కుండా.. మౌనంగా ఉంటూ మాట దాటేసే అలవాటు గ‌తంలో ఉండేది. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తూ ఇటీవ‌ల కాలంలో ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు వార్తాంశాలుగా మార‌ట‌మే కాదు..రాజ‌కీయ వ‌ర్గాల్లో కొత్త చ‌ర్చ‌కు తెర తీస్తున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల్ని అదే ప‌నిగా పొగుడుతున్న వైనాన్ని విప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి. రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌వుల్లో వ్య‌క్తులు ఆచితూచి మాట్లాడాల్సి ఉన్నా.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్న గ‌వ‌ర్న‌ర్ తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఏపీ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు చెప్పిన గ‌వ‌ర్న‌ర్‌.. ఎంద‌రో మ‌హ‌నీయుల త్యాగ ఫ‌లితంగా వేడుక‌లు జ‌రుపుకుంటున్న‌ట్లు చెప్పారు. సంక్షోభాల‌ను అవ‌కాశాలుగా మ‌లుచుకొని అభివృద్ధి ప‌థంలోకి వెళుతున్న‌ట్లు చెప్పిన ఆయ‌న‌.. ఏపీలోని 85 శాతం ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్న‌ట్లుగా చెప్పారు. ఏపీ స‌ర్కారు వేగంగా అభివృద్ధి చెందుతుంద‌ని కితాబు ఇవ్వ‌టంపై త‌ప్పుప‌డుతున్నారు.

కాపుల‌కు 5 శాతం రిజ‌ర్వేష‌న్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేశామ‌ని.. బీసీల‌కు న‌ష్టం వాటిల్ల‌కుండా కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇస్తున్న‌ట్లు చెప్పిన ఆయ‌న‌.. బీసీ విద్యార్థుల విదేశీ విద్య కోసం రూ.10 ల‌క్ష‌లు ఇస్తున్న‌ట్లు చెప్పారు. బీసీ స‌బ్ ప్లాన్ నిధులు పెంచుతున్న విష‌యాన్ని వెల్ల‌డించ‌టంతో పాటు.. వాల్మీకి.. బోయ‌ల‌ను ఎస్టీల్లో చేర్చాల‌ని కేంద్రాన్ని కోర‌నున్న‌ట్లు చెప్పారు. ఏపీ స‌ర్కారు చేప‌ట్టినట్లుగా వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల గురించి వివ‌రంగా చెప్పుకొచ్చారు.

మిగిలిన విష‌యాల్ని ప‌క్క‌న పెడితే.. ఏపీలో 85 శాతం ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నార‌ని గ‌వ‌ర్న‌ర్ ఎలా చెప్ప‌గ‌ల‌ర‌న్న సూటి ప్ర‌శ్నను ప‌లువురు సంధిస్తున్నారు. ఒక‌వేళ‌.. ఏపీలోని 85 శాతం ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నార‌న్న‌దే నిజ‌మైన ప‌క్షంలో.. ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్ నిర్వ‌హిస్తున్న పాద‌యాత్ర‌కు భారీ ఎత్తున ప్ర‌జ‌లు రావ‌ట‌మే కాదు.. బాబు హ‌యాంలో తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల గురించి చెప్పుకోవ‌టాన్ని ఏమ‌నాలి?

జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఫిర్యాదు చేసే వారిని లెక్క‌లోకి తీసుకోమ‌నే మాటే చెబితే.. బాబు స‌ర్కారుకు మిత్రప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. బాబు అనుభ‌వాన్ని ప‌దే ప‌దే ప్ర‌స్తావించే ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్వ‌హించే ఏపీ ప‌ర్య‌ట‌న‌ల్లో వివిధ వ‌ర్గాల‌కు చెందిన వారు తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను అదే ప‌నిగా ఏక‌రువు పెట్ట‌టాన్ని మ‌ర్చిపోలేం. మ‌రి.. ఈ లెక్క‌న చూస్తే.. 85 శాతం ప్ర‌జ‌లు ఏపీలో హ్యాపీగా ఎలా ఉన్నార‌న్న సందేహం రావ‌టం ఖాయం. ఎవ‌రికి క‌నిపించ‌ని హ్యాపీనెస్ గ‌వ‌ర్న‌ర్ సాబ్ కు మాత్ర‌మే ఎలా క‌నిపిస్తోందో మ‌రింత వివ‌రంగా చెబితే బాగుంటుంది.


Tags:    

Similar News