గవర్నర్‌ ఎంతటి గడుసువారంటే..!

Update: 2015-06-27 05:30 GMT
సాధారణంగా సమాధానాలు చెప్పలేని ప్రశ్నలు వేసినప్పుడు సహనం కోల్పోతుంటారు. అలాంటి సందర్భంలోనూ తనదైన శైలిలో గడుసుగా చెప్పటం గవర్నర్‌ నరసింహన్‌కే చెల్లింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ కోసం ఢిల్లీ వచ్చిన ఆయన.. సమావేశాల మీద సమావేశాలు అయిన విషయం తెలిసిందే. హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు.. హోం శాఖ అధికారులతో పలుమార్లు భేటీ అయిన గవర్నర్‌ తిరిగి వెళ్లేటప్పుడు మీడియా ప్రతినిధులు మాట్లాడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

కొందరు మీడియా ప్రతినిధులు ఎలాగో ఒకలా ఆయన వద్దకు చేరుకొని.. ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. వీటికి ఎలాంటి సమాధానం చెప్పలేనని తేల్చేశారు. మామూలు సమావేశాలేనన్న మాట చెప్పిన ఆయన.. తాను ఏమీ చెప్పనని చెప్పేశారు.

ఇలాంటి సందర్భాల్లో కాస్తంత ఉడికించే.. రెచ్చగొట్టే ప్రశ్నలు కొందరు జర్నలిస్టులు సంధిస్తుంటారు. గవర్నర్‌ నరసింహన్‌ వ్యవహారంలోనూ అదే జరిగింది. మీరు సెక్షన్‌ 8 మీద అటార్నీ జనరల్‌ న్యాయసలహాను కోరటం నిజమేనా? కాకపోతే ఖండిచొచ్చుగా అంటూ వేసిన గడుసు ప్రశ్నకు గవర్నర్‌ కూల్‌గా స్పందిస్తూ నవ్వుతూ ఊరుకున్నారే కానీ ఏ మాత్రం ఇరిటేట్‌ కాలేదు.

ఇదే ప్రశ్నను పలుమార్లుపలువురు మీడియా ప్రతినిధులు వేసిన సమయంలో ఆయన స్పందనగా.. మీరు నన్ను ఇంటరాగేట్‌ చేస్తున్నారు.. కానీ.. నేను ఇలాంటి ఇంటారేషన్‌లు చాలానే చేశానని చెప్పటం ద్వారా.. విలేకరుల నోటి వెంట మాట రాకుండా చేశారు.

జర్నలిస్టులు ప్రశ్నలు వేయగలరు కానీ.. ఇబ్బంది పెట్టేలా వ్యవహరించలేరు. కానీ.. నన్ను మీరు ఎంతలా ఇబ్బంది పెడుతున్నారన్న మాటను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఇలాంటివి తాను ఐబీ చీఫ్‌గా పని చేసినప్పుడు చాలానే చేశానన్న గతాన్ని గుర్తు చేసి.. జర్నలిస్టుల నోటికి తాళం వేసే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఒత్తిడికి గురైనప్పుడు సహనం కోల్పోయే దానికి భిన్నంగా గవర్నర్‌ నరసింహన్‌ మాత్రం గడుసుగా సమాధానం చెప్పి తప్పించుకోవటం గమనార్హం.

Tags:    

Similar News