పాత‌ స‌మస్య‌తోనే మ‌ళ్లీ గాంధీకి గ‌వ‌ర్న‌ర్‌

Update: 2017-08-24 09:01 GMT
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ ఎల్‌ నరసింహన్ వైద్య రంగంపై ఫోక‌స్ పెట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. స‌ర్కారీ ద‌వాఖ‌నాల‌ను మెరుగుప‌రుస్తున్న‌ట్లు ఇటీవ‌లి కాలంలో తెలంగాణ స‌ర్కారు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల్లో నిజాయ‌తీ ఎంత ఉందో తేల్చ‌డానికో లేదంటే...ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో  వైద్యం అందుతున్న తీరును ప‌రీక్షించేందుకే కానీ....వరుసగా రెండో రోజు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ కు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. కుడికాలుకు చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి గవర్నర్ నిన్న - ఇవాళ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.

బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌ లోని ప్రభుత్వ గాంధీ దవాఖానకు ఎలాంటి హడావుడి లేకుండా వెళ్లిన గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఆ సమయంలో సర్జన్లు ఆపరేషన్ థియేటర్‌ లో ఉన్నారని చెప్పడంతో వారు వచ్చేవరకు 20 నిమిషాలపాటు గవర్నర్ సామాన్యుడిలా అక్కడే వేచి ఉన్నారు. ఈ సందర్భంగా దవాఖాన వైద్యులు - అధికారులతో మాట్లాడారు. ఆపరేషన్ అనంతరం వచ్చిన ప్లాస్టిక్ సర్జన్లు గవర్నర్ కుడికాలు చివరలో ఉన్న ఆనెను పరీక్షించారు. దానిని తొలిగించడానికి మైనర్ ఆపరేషన్ చేయాలని, ఆ తర్వాత కనీసం రెండువారాలు నడువకుండా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. ప్రస్తుతం తాను బిజీ షెడ్యూల్‌ తో ఉన్నానని, మరో 15 రోజుల తర్వాత షెడ్యూల్‌ లో మార్పులు చేసుకుని వచ్చి ఆపరేషన్ చేయించుకుంటానని వైద్యులకు గవర్నర్ చెప్పారు.

కాగా, ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ నరసింహన్ మీడియాతో మాట్లాడుతూ తాను కూడా సామాన్య పౌరుడినేని, ఇదివరకు కూడా ఇక్కడే చికిత్స చేయించుకున్నానని, అందుకే మరోసారి వైద్యుల సలహా కోసం వచ్చానని చెప్పారు. ఈ దవాఖాన కేవలం పేద - మధ్యతరగతి ప్రజలకు మాత్రమే కాదని - మంచి వైద్యంకోసం సంపన్నులు కూడా రావచ్చని ప్రజలందరికీ తెలియాలనే తరచుగా వస్తున్నానని ఆయన వైద్యులతో అన్నారు. పారిశుద్ధ్యం నిర్వహణ ఇప్పుడు చాలా బాగుందని కితాబిచ్చారు. ప్రజలతో ప్రేమగా మాట్లాడి వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా వైద్యసేవలు అందించాలని సూచించారు. ఏవైనా సమస్యలున్నాయా? అని ప్రశ్నించారు. రోగులకు సరిపడా సిబ్బంది లేరని - ఎంఆర్‌ ఐ యంత్రం ఒక్కటే ఉన్నదని మరొకటి ఉంటే బాగుంటుందని సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్‌ కుమార్ చెప్పారు. తాను సీఎంతో మాట్లాడి పరిష్కారమయ్యేలా సహకరిస్తానని గవర్నర్ హామీఇచ్చారు.
Tags:    

Similar News