#'మీటూ ఇండియా' ఫిర్యాదుల‌పై కేంద్రం క‌మిటీ!

Update: 2018-10-12 13:02 GMT
ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు నానా ప‌టేక‌ర్ పై న‌టి త‌నూ శ్రీ ద‌త్తా చేసిన ఆరోప‌ణ‌లు పెనుదుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. `#మీటూ ఇండియా`కు విప‌రీత‌మైన మద్ద‌తు లభిస్తోంది. సినీరంగం - రాజ‌కీయ రంగం - క్రీడా రంగం - కార్పొరేట్ ఆఫీసులు - ఇలా దాదాపుగా అన్నిరంగాల‌లో లైంగిక వేధింపుల‌కు గురైన మ‌హిళ‌లు త‌మ గ‌ళాన్ని వినిపిస్తున్నారు. మీటూ....అంటూ త‌మ చేదు అనుభ‌వాల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భార‌త్ లో ఉవ్వెత్తున్న ఎగ‌సిప‌డుతోన్న `#మీటూ ఇండియా`ఉద్య‌మంపై కేంద్ర ప్ర‌భుత్వం స్పందించింది. `మీటూ`లో మ‌హిళ‌లు చేస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకునేలా సీనియర్ న్యాయవాదులు - న్యాయ‌ నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్ర‌భుత్వం ప్రకటించింది. ఈ ప్ర‌కారం కేంద్ర స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి మేన‌కా గాంధీ ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్ర‌భుత్వ‌ - ప్రైవేటు...ఇలా ఏ రంగంలో అయినా లైంగిక వేధింపుల‌కు గురైన  మ‌హిళ‌లు ధైర్యంగా ముందుకు వ‌చ్చి ఫిర్యాదు చేయాల‌ని మేన‌కా గాంధీ కోరారు. `#మీటూ ఇండియా`ద్వారా వ‌చ్చిన ఫిర్యాదుల‌పై న‌లుగురు స‌భ్యుల‌తో ఏర్పాటు చేయ‌బోతున్న క‌మిటీ విచార‌ణ జ‌రుపుతుంద‌ని ఆమె తెలిపారు. లైంగిక వేధింపుల‌కు గురైన ప్రతి మ‌హిళ బాధ‌ను తాను అర్థం చేసుకుంటాన‌ని మేన‌కా తెలిపారు. మ‌రోవైపు - సినీరంగంలో లైంగిక వేధింపుల‌పై `ది ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా` కూడా స్పందించిన సంగ‌తి తెలిసిందే. సినీ ఇండ‌స్ట్రీలో లైంగిక వేధింపుల నివార‌ణ‌కు ఓ క‌మిటీని ఏర్పాటు చేయ‌బోతున్నామ‌ని `ది ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా` ప్ర‌క‌టించినంది. ఇండ‌స్ట్రీలో అన్ని విభాగాల్లో మ‌హిళ‌ల సుర‌క్షితంగా - స్వేచ్ఛ‌గా ప‌నిచేసే వాతావ‌ర‌ణం క‌ల్పించేందుకు కృషి చేసేందుకు `గిల్డ్` ప్ర‌య‌త్నిస్తోంది. కేంద్రంతో పాటు గిల్డ్ కమిటీలు ఏర్పాటు చేయ‌డంపై మ‌హిళ‌లు - మ‌హిళా సంఘాలు హ‌ర్షం వ్య‌క్తం చేశాయి.

Tags:    

Similar News