నిజం చావ‌కూడ‌ద‌నే గౌత‌మి అలా చేసింద‌ట‌

Update: 2016-12-11 05:55 GMT
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు వైద్యచికిత్స విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంత గోప్యతను ఎందుకు పాటించిందని తమిళ నటి గౌతమి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసి క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆమెను చూడటానికి ఎవరినీ ఎందుకు అనుమతించలేదని ప్రధాని మోడీకి రాసిన లేఖలో గౌతమి ప్రశ్నించారు. అయితే ఒక్క‌సారిగా ఎందుకు గౌత‌మి ఈ విధ‌మైన నిర్ణ‌యం తీసుకున్నార‌నే విష‌య‌మై తాజాగా మీడియాకు ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో గౌత‌మి క్లారిటీ ఇచ్చారు.

జ‌య‌ల‌లిత‌ను తానెంతో అభిమానించే దానిన‌ని త‌న జీవితంలో క్లిష్ట ద‌శ‌లో ఆమెను గుర్తు చేసుకొని ధైర్యం పొందాన‌ని గౌత‌మి వివ‌రించారు. 68 ఏళ్ల జయలలిత గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి తాను క‌ల‌త చెందిన‌ట్లు తెలిపారు. ఆసుపత్రిలో చేరడం-చికిత్స పొందటం-కోలుకున్నట్టు వచ్చిన వార్తలు-ఆకస్మికంగా కన్నుమూయడంపై అనేక సమాధానాలు లేని ప్రశ్నలు ఉద్భవించాయని అవి త‌న‌ను తీవ్ర గంద‌ర‌గోళంలో ప‌డేశాయ‌ని గౌతమి పేర్కొన్నారు. ఈ విషయాలకు సంబంధించి ప్రజలకు ఎలాంటి సమాచారం లేదని, ఎంతో విచారంతో ఆసుపత్రికి వెళ్లిన‌ అనేక మంది ప్రముఖులు జయలలితను కలిసి ఆమె త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షలను నేరుగా వ్యక్తం చేయకుండా అడ్డుకున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎందుకు ఇంత గోప్యతను పాటించారని, ప్రియతమ ప్రజానాయకురాలు, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకు ఎవరిని కలవకుండా ఒంటరిని చేశారని ఆమె ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రిని ఎవరూ కలవకుండా ఆంక్షలు విధించిన వారు ఎవరని గౌతమి ప్రశ్నించారు.

జయలలితకు సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకున్న వ్యక్తులు ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నానని, ఇవి తమిళనాడు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలని, వారి గొంతుకగా తాను వినిపించాన‌ని గౌతమి తెలిపారు. అయితే తాను ఎవ‌రిని ఉద్దేశించో ఈ అనుమానాలు వ్య‌క్తం చేయ‌డం లేద‌ని గౌత‌మి క్లారిటీ ఇచ్చారు. కేవ‌లం నిజం చ‌నిపోకూడ‌ద‌నే ఉద్దేశంతోనే తాను ప్ర‌ధాన‌మంత్రికి లేఖ రాసిన‌ట్లు ఆమె వెల్ల‌డించారు. జయ మ‌ర‌ణం విష‌యంలో నెల‌కొన్న గంద‌ర‌గోళాన్ని తొల‌గించేందుకు త‌న ప్ర‌య‌త్నంతో కొంద‌రి వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొంటాన‌నేది త‌న‌కు తెలియ‌ని అంశ‌మ‌ని గౌత‌మి అన్నారు. త‌న‌లేఖ వెనుక ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఉన్నార‌నేది ప‌క్కా ఊహాగాన‌మని గౌతమి వివ‌రించారు. గ‌తంలో త‌న ఫౌండేష‌న్ కోసం ప్ర‌ధానిని క‌లిశాన‌ని, దానికీ దీనికి సంబంధం లేద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. తాను రాజ‌కీయాల్లోకి రావాల‌నే ఆలోచ‌న‌తో అస్స‌లే లేన‌న్న గౌత‌మి..ఈ విష‌యంలో అన‌వస‌ర ప్ర‌చారం చేసే వాళ్ల‌ను చూస్తే ఇబ్బందిగా ఉంద‌న్నారు. త‌న కూతురు భ‌విష్య‌త్ తీర్చిదిద్ద‌డం అనే ల‌క్ష్యంతో తాను అడుగులు వేస్తున్న‌ట్లు వివ‌రించారు.
Tags:    

Similar News