కార్చిచ్చుతో అమెరికాలో రాజకీయ రచ్చ
ఈ తీరు మన దేశ రాజకీయాల్లోనే కాదు.. అమెరికాలోనూ లేదన్న విషయం తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే అర్థమవుతుంది.
కష్టం వచ్చినప్పుడు చేయి.. చేయి కలపాలి. కష్టం నుంచి బయటకు వచ్చేందుకు ఉన్న అన్ని మార్గాలు అన్వేషించాలి. అవకాశం ఉన్న వనరుల్ని ఒక చోటుకు తీసుకొచ్చి సమస్కను పరిష్కరించే అంశం మీద ఫోకస్ చేయాలే తప్పించి.. గుడ్డు మీద ఈకలు పీకిన చందంగా.. దరిద్రపుగొట్టు రాజకీయాన్ని కష్ట సమయంలో తీసుకురాకూడదు. ఈ తీరు మన దేశ రాజకీయాల్లోనే కాదు.. అమెరికాలోనూ లేదన్న విషయం తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే అర్థమవుతుంది.
మనకు మాదిరే ఏదైనా విపత్తు విరుచుకుపడిన వేళలో.. ప్రజలకు చేయాల్సిన సహాయక చర్యలు.. ప్రభుత్వానికి అండగా నిలవటం.. చేయి చేయి కలపి.. సమస్య తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయాలి. కానీ.. అమెరికాలో ఇప్పుడు అందుకు భిన్నమైన వాతావరణం ఉంది. గడిచిన కొద్ది రోజులుగా అమెరికాలోని లాస్ ఏంజెలిస్ ను కమ్మేసిన కార్చిచ్చుతో జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం దగ్గర దగ్గర రూ.15 లక్షల కోట్లుగా చెబుతున్నారు. దీనికి తోడు వేలాది విలాసవంతమైన ఇళ్లు మంటల్లో కాలిపోగా.. వేలాది ఎకరాల విస్తీర్ణం అగ్నికి ఆహుతై.. ఇప్పుడా ప్రాంతం మొత్తం దుమ్ముధూళితో మసకబారిపోయిన పరిస్థితి.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు దరిద్రపుగొట్ట రాజకీయం ఎంట్రీ ఇచ్చింది. కార్చిచ్చు తీవ్రత పెరగానికి కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాబోయే దేశాధ్యక్షుడు ట్రంప్. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన గావిన్ ఒక కౌంటర్ లేఖను విడుదల చేశారు. కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్ని ట్రంప్ పర్యటించాలని.. బాధితుల్ని పరామర్శించాలన్నారు.
ఈ విషాదాన్ని రాజకీయం చేయొద్దన్న ఆయన.. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దని ట్రంప్ కు చురకలు అంటించారు. ఆరేళ్ల క్రితం ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ తరహా ఘటన చోటు చేసుకుందని.. అప్పట్లో ఆయన పరామర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. కాలిఫోర్నియా కష్టంలో ఉంటే.. రాజకీయం చేయటం సరికాదన్నారు. కార్చిచ్చు వేళ.. బైడన్ సైతం సత్వరమే స్పందించారన్నారు. అయినప్పటికి ట్రంప్ మాత్రం తన నోటికి పని చెప్పటం మాత్రం అపట్లేదు. కాలిఫోర్నియా గవర్నర్ డెమొక్రటిక్ కాగా.. ట్రంప్ రిపబ్లికన్ అన్న విషయం తెలిసిందే.
దీంతో.. తన రాజకీయ ప్రత్యర్థిని ఇరుకున పడేలా ట్రంప్ తన నోటికి పని చెబుతున్నారు. దీనికి తగ్గట్లే ట్రంప్ తాజా వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. వైట్ హౌజ్ నుంచి బైడెన్ వెళ్లిపోయే ముందు.. తనకు మిగిల్చింది కాలిఫోర్నియా కార్చిచ్చు అంటూ నోరు పారేసుకున్నారు ట్రంప్. ఇదిలా ఉంటే..కార్చిచ్చు నేపథ్యంలో కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ తో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఫోన్ లో మాట్లాడారు. అమెరికా కెనడాలు ఇరుగుపొరుగు దేశాలు మాత్రమే కాదు.. అంతకు మించి.. కష్టకాలంలో మేం స్నేహితులమనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా అంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది.