పీకేపై వైసీపీ మంత్రి సెటైర్...ఆయ‌న స‌ల‌హాలు ఇస్తే ఏంటి మేం అమ‌లుచేయొద్దా?

Update: 2022-04-23 00:30 GMT
దేశ రాజ‌కీయాల నుంచి తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల వ‌ర‌కూ, ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ఇప్పుడు హాట్ టాపిక్‌. గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంలో పీకే కీలక పాత్ర పోషించారు. ప్ర‌స్తుతం కూడా ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహకర్తగా ఉన్న విషయం తెలిసిందే. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి స‌ల‌హాలు ఇస్తున్న‌ట్లే ఆయ‌న తెలంగాణ‌లో ప‌రిపాలిస్తున్న కేసీఆర్‌కు సైతం త‌న సూచ‌న‌లు ఇచ్చే ప్రాజెక్టు తీసుకున్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో వ్యూహాలకు పదునుపెట్టిన ఆయన.. కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇదే స‌మ‌యంలో తాజగా కాంగ్రెస్‌ అధిష్టానానికి ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ బయటకు వచ్చింది క‌ల‌క‌లానికి కార‌ణ‌మైంది. ఏపీలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కలిసివెళ్లాలని పీకే సూచించార‌న్న‌ది హాట్ టాపిక్‌గా మారింది. అయితే, దీనిపై వైసీపీ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ ఘాటుగా స్పందించారు.

కాంగ్రెస్ పార్టీకి పూర్వ‌వైభ‌వంలో భాగంగా, తమిళనాడులో డీఎంకేతో, మహారాష్ట్రలో ఎన్సీపీతో, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌తో, ఝార్ఖండ్‌లో జేఎంఎంతో కలిసి వెళ్లాలని.. తెలంగాణలో విడిగా పోటీ చేయాలని... ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ముందు సాగితే బాగుంటుందనే ప్రతిపాదన తీసుకొచ్చారు.ఈ కామెంట్లు తీవ్ర చ‌ర్చకు తెర‌లేపిన స‌మ‌యంలో, ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు పుట్టిందే వైసీపీ అన్న ఆయన.. వ్యూహకర్తలు సలహాలు ఇస్తారు.. కానీ, అమలు చేయాలో లేదో నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం నాయకుడే అని తేల్చిచెప్పారు.

కాంగ్రెస్ పార్టీని, సోనియాగాంధీని ఎదిరించి నిలబడ్డ మొగోడు వైఎస్‌ జగన్ ఒక్కడే అని గుడివాడ‌ అమర్‌నాథ్ తేల్చిచెప్పారు. 135 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ సీట్ల కోసం వెతుక్కునే స్థాయికి దిగజార్చింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయేనన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీతో పొత్తులా..!? నవ్విపోతారు అంటూ ఎద్దేవా చేశారు. మొత్తంగా వైసీపీ, కాంగ్రెస్ దోస్తీ ప్రతిపాదన ఇప్పుడు ఏపీలో పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న‌ప్ప‌టికీ వైసీపీ శ్రేణులు మాత్రం త‌మ నాయ‌కుడి నిర్ణ‌యంపై క్లారిటీతో ఉన్నార‌ని అంటున్నారు.
Tags:    

Similar News